
( సంత్ తుకారాం జయంతి )
దేవుడు ఒక్కడే, ముక్తి మార్గానికి భక్తిమార్గమే ప్రధాన ద్వారమని ప్రబోధించిందీ భక్తి ఉద్యమం. ఈ ఉద్యమం వల్ల సమాజంలోని అట్టడుగు పేదవర్గాలు, అణగారిన వర్గాలు భక్తిమార్గాన్ని అనుసరించడం జరిగింది. సమాజంలో ఉన్న ఎంతోమంది అట్టడుగు వర్గాలకు చెందిన తాత్వికులు, మేధావులు, ఆలోచనా పరుల్లో ప్రధానంగా చెప్పుకోదగినవారు తుకారాం వంటి గురు శిరోమణులు. మరాఠీ భాషలో అత్యంత గొప్ప భక్తి కవులలో సాధువు తుకారాం ఒకరు. బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ప్రతిరూపంగా మార్చగల అసాధారణ సామర్థ్యంలో ఆదర్శప్రాయమైన ప్రతిభను తుకారాం ప్రదర్శించారు. సంత్ తుకారాం భారతదేశ సాంస్కృతిక చరిత్రలో, ముఖ్యంగా భక్తి సంప్రదాయంలో ప్రధాన వ్యక్తులలో ఒకరు. అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేశారు.
మరాఠీ సాహిత్య సంస్కృతిని విస్తృతంగా ప్రభావితం చేసిన మరే ఇతర మరాఠీ కవి కూడా లేడంటే అతిశయోక్తి కాదు . తుకారాం లేకుండా మరాఠీ కవిత్వం ఒక శైలిగా అసంపూర్ణంగా ఉంటుంది.. ధర్మ నిష్టతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్యపరచడంలో కీలక భూమికను పోషించారు. తాను రచించిన అభంగాల్లో విఠలేశ్వరుని కొలుస్తూనే సత్యాసత్యాలు, ధర్మాధర్మాల పట్ల హిందువుల్లో విచక్షణ కలిగించేందుకు, భక్తి ఉద్యమం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు అజన్మాంతం పాటుపడ్డారు.
పాండురంగ భక్తుడైన తుకారాం మహారాష్ట్రలోని దేహూ అనే గ్రామంలో కనకై, బోల్హోబా దంపతులకు 1607వ సంవత్సరంలో జన్మించారు. తుకారాం బాల్యం నుండే దైవరాధనలో పాల్గొంటూ ఉండేవారు. ఒకసారి మహారాష్ట్ర ప్రాంతంలో కరువు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు ఆకలి చావులు గురయ్యారు. దీంతో సంసారిక జీవితంపై విరక్తి కలిగి తనను తాను విఠలుని పాదపద్మాలకు సమర్పించుకున్నాడు. ఒక రోజు ఒకరోజు సంత్ నామదేవ్ స్వప్నంలో కనిపించి అభంగ కావ్యము రచించాలని తుకారాంని ప్రేరేపించారు. ఆ ప్రేరణతో తుకారాం ఏడెనిమిది వేల అభంగాలు రచించాడు. అంతరాత్మ నుండి పెల్లుబికిన భక్తిగీతాల వెల్లువ అది. తుకారాం తన అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు పరోక్షంగా ఊతం ఇచ్చారు. ధర్మనిష్ఠతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్య పరచడంలో కీలకమైన భూమికను పోషించారు. ముస్లిం పాలకుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడడంలో హిందువులను పరోక్షంగా ప్రేరేపించిన వాగ్గేయకారుడు సంత్ తుకారాం.పాండురంగడి పట్ల తుకారం భక్తి అపరిమితమైనది. జాతీయత, లౌకికవాదం వంటి అంశాలను తుకారం తన భక్తి మార్గాన్ని అనుసంధానించి సామరస్యానికి ప్రాతినిధ్యం వహించారు.
హిందూ పద పాదషాహి ఛత్రపతి శివాజీకి కర్తవ్య పాలన గావించిన వ్యక్తి తుకారాం. వైరాగ్యం పొంది సన్యాస ప్రవృత్తి పెరిగిన శివాజీకి తపస్సు కంటే కూడా కర్తవ్యం గొప్పది..కర్తవ్య పాలన సూచించని వ్యక్తికి మరణానంతరం కూడా సద్గతి లభించదు..కనుక నీ రాజ్యాన్ని శక్తియుక్తులతో నేర్పుతో నిర్వహించమంటూ కర్తవ్య బోధ చేశారు. ‘‘హిందూ సమాజం యొక్క నైతిక పతనాన్ని ఆపగలిగేలా ఉండాలి, భారతదేశం సర్వతోముఖ వికాసం చెందడానికి ఆలోచించాలి..అదే నా కోరిక…అది నాకు కానుకగా సమర్పించు,’’ అని శివాజీని తుకారాం అడిగారు. తుకారం తాను రాసిన అభంగాలను మధురంగా గానం చేస్తూ ప్రజల్లో భక్తిభావాలను పెంపొందించారు. ఈ సంవత్సరం మార్చ్ 22న ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. తన అభంగాల ద్వారా హిందూ సమాజాన్ని చైతన్యపరిచిన సంత్ తుకారాం బోధనలను మనం మనసా వాచా కర్మణా ఆచరించడమే మనం ఆయనకు ఇచ్చే పవిత్రమైన, ఘనమైన నివాళి.





