
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకు దేశ రక్షణరంగానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై కాన్పుర్ ఆయుధ కర్మాగార ఉద్యోగిని ఉత్తర్‌ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అరెస్టు చేసింది. ఫ్యాక్టరీలో జూనియర్ వర్క్ మేనేజరుగా విధులు నిర్వహిస్తున్న కుమార్ వికాస్‌కు గత జనవరిలో పాక్ మహిళా ఏజెంటుతో ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడింది. ఆమె తనను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) ఉద్యోగి నేహాశర్మగా పరిచయం చేసుకొంది. అనంతరం వికాస్‌కు డబ్బు ఆశ చూపడంతోపాటు వలపు వల విసిరింది. దీంతో అతడు లూడో గేమ్ యాప్‌ను ఉపయోగించి సంస్థకు చెందిన సున్నితమైన సమాచారం ఆమెకు చేరవేశాడు. ఈ సమాచారం లీకేజీతో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పాక్ ఏజెంటు ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పుర్ ఆయుధ కర్మాగార మెకానిక్ రవీంద్ర కుమార్‌పైనా ఇలాగే వలపు వల విసరడంతో పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. రవీంద్ర పాక్‌కు అందజేసిన సమాచారంలో గగన్‌యాన్ ప్రాజెక్టు వివరాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.





