News

హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్

279views

( వైశాఖ శుక్ల పక్ష తదియ – శివాజీ మహారాజ్ జయంతి )

భారతీయులు స్వాతంత్ర్య సంపాదనకై శివాజీ ఆదర్శాన్ని స్వీకరించాలని 1937లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇందులో ఒక మహత్తర సత్యం దాగి ఉంది. శివాజీ కార్యపద్ధతి నుండి 1857 స్వాతంత్ర్య సంగ్రామ సూత్రధారులు మార్గదర్శనాన్ని పొందారు. వెయ్యేళ్ల పరదాన్యంతో అవమానాలతో, నిరాశతో నిండిన జీవితం నుండి భారత ప్రజలకు విముక్తి ప్రసాదించిన మహాపురుషుడు శివాజీ మహారాజ్. జాతికి కర్తవ్య బోధ చేయడంలో, బాధ్యత సక్రమంగా నెరవేర్చడానికి పౌరులలో గొప్ప ఆదర్శాన్ని నెలకొల్పిన ఆ మహనీయుడి జయంతి నేడు. ఛత్రపతి శివాజీ తిథి ఆధారిత జయంతిని ఈ 2025లో మార్చి 17న జరుపుకుంటున్నాము.

శివాజీ జీవితంలోని తేజస్విత రహస్యం ఏమిటి..?? శివాజీకి రాజ్యాభిషేకం జరిగింది. ఇదే ఆయన గొప్పతనానికి కారణమా?? శివాజీ కేవలం ఒక రాజు కాదు. యుగపురుషుడు. శివాజీ జన్మించే నాటికి హిందూ సమాజం అధోగతిలో ఉంది. మొఘలుల నిరంకుశ పాలన సాగుతోంది. అత్యాచారాలు, పాశవికత హిందూ సమాజాన్ని క్రుంగదీసివేశాయి. దాస్యం వల్ల, నిరాశ వల్ల ఆత్మగౌరవం అడుగంటిపోయింది. యవనులు, మ్లేచ్చులు రాజ్యమేలుతారని పురాణాలలో ఉందని ప్రజలు చెప్పుకోసాగారు. ఘోరమైన ఈ భావదాస్యపు కాలఖండంలో జన్మించిన శివాజీ స్వరాజ్య స్థాపన మంత్రాన్ని ఉచ్ఛరించారు. మొఘల్, పఠాన్, ఆంగ్లేయ, ఫ్రెంచి, డచ్, పోర్చుగీసుల దురంతాల కలియుగాన్ని వెనక్కి తిప్పి కృతయుగాన్ని ఆరంభించారు. హైందవీ స్వరాజ్యం అనే ఆయన కార్యం భారతదేశమంతటి కోసమే జరిగింది. ఆయన పోరాటం ముమ్మాటికి ఒక జాతీయ పోరాటం. ఆయన సాధించింది ఒక జాతీయ విప్లవం. అందుకే, శివాజీ అంటే కేవలం సామ్రాట్ కాదు ముమ్మూర్తులా హిందూ హృదయ సామ్రాట్..

శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. తల్లి జిజాబాయి పెంపకం, సమర్థ రామదాసు ప్రేరణ వల్ల హిందూ సమాజ రక్షణకు కంకణం కట్టుకున్న శివాజీ ముస్లిం పాలకులతో సుదీర్ఘకాలం పోరాటం జరిపినా ఆయనలో అన్యమతాల పట్ల ద్వేషం, అసహిష్ణుత కనిపించేవి కావు. శివాజీ పరమతాలను గౌరవించినా ఆ మతాలు హిందూ సమాజం పట్ల వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకించారు. హిందువులను ఇస్లాంలోకి గానీ, క్రైస్తవ మతంలోనికి మార్చడానికి అంగీకరించలేదు. అంతేకాక, ఆ విధంగా క్రైస్తవ మతం, ముస్లిం మతాలలోకి మార్చబడిన వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తెచ్చారు. శివాజీ అష్టప్రధానుల భారతీయ పద్ధతిని పరిపాలనలో ప్రవేశ పెట్టారు. ఆయన రాయించిన రాజ్య భాషా కోశం ఆయన భాషా శుద్ధి ప్రయత్నానికి సూచకం. సైన్య వ్యవస్థలోనూ, నౌకాబల నిర్మాణంలోనూ ఆయన విదేశీయులను అనుసరించలేదు. భారతీయ ప్రతిభా, విశ్వాసాలు ఆధారంగా క్రొత్త, క్రొత్త నిర్మాణాలు చేశారు. సముద్ర యాత్రా నిషేధం వంటి దురాచారాలను శివాజీ తొలిగించారు. బాజాజీ నింబాల్కర్, నేతాజీ పాల్కర్‌లను శుద్ధి చేసి హిందూధర్మంలోకి ఆహ్వానించారు. అంతేకాదు, సమాజం నుంచి దూరమై ముస్లింలుగా మారినవారు తిరిగి తమ సమాజంలో ప్రవేశించడానికి మార్గం చూపారు.

లక్ష్యం ఎంత ఉదాత్తంగా ఉంటే కార్య సాఫల్యానికి వ్యక్తి చేసే ప్రయత్నాలలో అంతటి పవిత్రత, దృఢత్వం, నిష్ట కానవస్తాయి. కనుకనే శివాజీ రాజ్యపాలనలో కఠోరమైన అనుశాసనం అమలు జరిగేది. ఆయన స్వీయ జీవనంలో పూర్తి సంయమనం, నిష్కళంకమైన శీలం కానవస్తాయి. దేశం, ధర్మం కోసం సర్వస్వాన్ని బలిదానం చేయడంలో లభించే అలౌకిక ఆనందంలోని అనుభవాన్ని ఆయన జాతి అంతటికి కలిగించారు.

శివాజీ కార్యం దివ్యం, విలక్షణం, అసామాన్యం. ఆయన సాహసం, పరాక్రమం, రాజనీతి చతురత, రణకౌశల్యం, తీక్షణమైన బుద్ధి, సంఘటనా సామర్థ్యం లోకోత్తరమైనవి. శివాజీ మహారాజ్ దేశంలోని గొప్ప పాలకులలో ఒకరు. దేశానికి నిజమైన రూపశిల్పి. మన చరిత్రలో శివాజీ లాంటి యోధుడు లేకుండా భారతీయ సంస్కృతి అంత గాఢంగా వుండేది కాదు అంతే అతిశయోక్తి కాదు. జాతికి కర్తవ్య బోధ చేయడంలో, బాధ్యత సక్రమంగా నెరవేర్చడానికి పౌరులలో గొప్ప ఆదర్శాన్ని నెలకొల్పారు. శివాజీ చూపించిన సైనిక చతురత, వ్యూహాత్మక నిర్ణయాలు, స్ఫూర్తిమంతమైన అడుగులు ఎప్పటికీ ఆచరణాత్మకం. శివాజీ మహారాజ్ ఏప్రిల్ 3, 1680న రాయ్‌గఢ్ కోటలో అస్తమించారు. అయితే స్వరాజ్యం కోసం పోరాడిన యోధుడిగా ఆయన వారసత్వం భారతదేశం అంతటా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది.