
ముస్లిం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ మండిపడింది. కర్ణాటక అభివృద్ధిలో భాగంగా లక్ష కోట్ల అభివృద్ధి పనులకు కర్ణాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం చేసే కాంట్రాక్టుల్లో 2బీ కేటగిరీ కింద ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందు కోసం.. KTPPA(Karnataka Transparency in Public Procurement Act, 1999) చట్టంలో సవరణ చేసి ముందుకెళుతుండటంపై కర్ణాటక బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించింది. ఇలా కాంట్రాక్టుల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ మండిపడింది. అది కూడా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని కర్ణాటక బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రిజర్వేషన్లలో భాగంగా ముస్లిం కాంట్రాక్టర్లు రూ.2 కోట్ల వరకూ కాంట్రాక్టులను దక్కించుకోవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద చర్చకే దారితీసింది. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం ఎంపిక చేసిన కొన్ని మతాల వారికి మాత్రమే వర్తిస్తుంది, ఒక మతానికి అనుకూలంగా – మిగతా మతాల వారిని విస్మరించి విధానాలకు రూపకల్పన చేస్తారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై నియంత్రణలు, నిషేధాజ్ఞలూ విధిస్తూంటుంది. ఇప్పుడు మాత్రం ఒక మతపు వ్యక్తుల డిమాండ్లను నెరవేర్చడానికి తన పద్ధతి మార్చుకుంది.





