
మహారాష్ట్రలో తాజాగా ఒక వివాదానికి తెర లేచింది. అక్కడ హిందువులు నిర్వహించే ఒక ఉత్సవం కొద్దిరోజుల పాటు జరుగుతుంది. అందులో వ్యాపారాలు చేయడానికి తాము ముస్లింలను అనుమతించడం లేదు అని స్థానికులంతా తీర్మానం చేశారు. ఎందుకు? ఆ ఉత్సవం సందర్భంగా కొన్ని ఆచారాలను తాము పాటిస్తామనీ, ముస్లింలు పాటించరనీ కాబట్టి తాము వారిని ఉత్సవంలోకి అనుమతించరాదని తీర్మానించామని అంటున్నారు ఆ ప్రాంత ప్రజలు.
అహల్యానగర్ జిల్లా, మాధీ గ్రామంలో మాధీచీ యాత్ర జరుగుతుంది. హోలీ రోజున మొదలై గుధి పాడ్వ (మరాఠీల ఉగాది) వరకు నిర్వహిస్తారు. ఈ యాత్రలోకే ముస్లిం వ్యాపారులను అనుమతించ బోమంటూ ఆ గ్రామ ప్రజలు చేసిన తీర్మానం సర్పంచ్ సంజయ్ మర్కడ్, గ్రామ డెవలప్మెంట్ అధికారి అనిల్ ల్వాండే సంతకాలతో వెలువడింది. ఆ తీర్మానంలో ఏం ఉంది? ‘ముస్లిం సమాజానికి చెందినవారు యాత్ర సమయంలో గ్రామస్థులు పాటించే ఆచారాలను పాటించరు. కాబట్టి మాధీచి యాత్రలో వారికి ప్రవేశం లేదు’ అని పేర్కొన్నారు. దీని వెనుక పరమార్థాన్ని ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలియచేశారు. యాత్ర సాగే అన్ని రోజులు ప్రజలు మౌనం పాటిస్తారు. ఉపవాసాలు చేస్తారు. ఆఖరికి పెళ్లిళ్లు కూడా చేయరు. క్షవరాలకు కూడా వెళ్లరు. వీటి గురించి ముస్లింలకు తెలుసు. అయినా పాటించరు అని చెప్పారాయన. దీని మీద ఇప్పుడు జిల్లా యంత్రాంగం దర్యాప్తునకు ఆదేశించింది.





