
అదొక ఎడతెగని ప్రహననం. కానీ చాలా క్రూరమైనది. అదే ద్రవిడ పార్టీల, ప్రధానంగా డీఎంకే హిందీ వ్యతిరేక వాదం. దీనికి తోడుగా తెచ్చుకుంటారు హిందూ వ్యతిరేకవాదం. ఆ రెండూ వేర్వేరు కాదనుకునే వశు ప్రాయులు కూడా అందులో తక్కువేమీ కాదు. ఎడారి మతం క్రైస్తవంలో చేరి కూడా సనాతన ధర్మాన్ని విమర్శించే నికృష్టులు డీఎంకేలో ఉన్నారు. అది ఎవరో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఇబ్బడిముబ్బడిగా ఉన్నందున పాత అస్త్రం తిరిగి బయటకు తీసింది డీఎంకే. అదే తమిళుల మీద ‘ఢిల్లీ’ హిందీ రుద్దడం. కొత్త విద్యావిధానం పేరుతో తమిళుల మీద హిందీని రుద్దాలని కేంద్రం చూస్తున్నదని, దీనిని వ్యతిరేకిస్తామని, ఉద్యమిస్తామని పాచిపాట పాడుతున్నారు ఎంకే స్టాలిన్. తల్లి కుక్క భౌమంటే పిల్లకుక్కలు కూడా రాగం అందుకున్నట్టు హిందీలో రాసి ఉన్న పేర్ల మీద తారు పూస్తామని ఆ పార్టీ కార్యకర్తలు బయలుదేరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా అందుబాటులోకి వచ్చిన వేళ రెండు భాషలు చాలవా, ద్విభాషా సూత్రం చాలదా అన్నది స్టాలిన్ ప్రశ్న. ఆ భాషలు తమిళం, ఇంగ్లిష్, ఈ హిందీ రుద్దడం వెనుక ఉన్నది సంస్కృతం అమలులోకి తేవాలన్న దుర్బుద్ధి మాత్రమేనని కూడా ఈ మధ్య స్టాలిన్ కనుగొన్నాడు
.
విద్యావిధానంలో త్రిభాషాసూత్రం ఎన్డీఏ లేదా బీజేపీ ప్రభుత్వం తెచ్చినదేమీ కాదు. 1961లోనే విద్యావిధానం గురించి చర్చ జరిగినప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ తరువాతే ఆ సూత్రాన్ని అమలులోకి తెచ్చారు. 1968లో హిందీయేతర భాషలు ఉన్న రాష్ట్రాలలో హిందీని బోధించాలని నిర్ణయించారు. ఊరంతా ఒకదారి, ఉలూపికట్టెది మరొక దారి -అన్నట్టు ఆ తరువాత నుంచి తమిళనాడులో ద్విభాషా సూత్రం అమలులోకి తెచ్చారు. హిందీ పట్ల ద్వేషాన్ని బాగా నూరిపోశారు.
డీఎంకే ఏనాడూ ప్రజాస్వామ్యబద్ధంగా, జాతీయ స్ఫూర్తిగా అనుగుణంగా వ్యవహరించింది లేదు. అది ఈ దేశాన్ని గౌరవించే పార్టీ కాదు. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో 54 శాతం ప్రజలు హిందీ -మాట్లాడగలరు. అంతకంటే ఎక్కువ శాతం ఆ భాషను అర్ధం చేసుకోగలరు. సమీప గతంలోనే అంటే 2001 జనాభా లెక్కల ప్రకారం చూసినా ఆనాడు ఉన్న 121 కోట్ల మందిలో 52 కోట్లు తాము మాట్లాడే భాష హిందీ అని తెలియచేశారు. అంటే 44 శాతం. మరి ఇంగ్లిష్ మాటేమిటి? 130 మిలియన్లు మాత్రమే మాట్లాడగలరు. కాబట్టి అనుసంధాన భాష హిందీ అవుతుందా? ఇంగ్లిషా? స్టాలిన్ లెక్క ప్రకారం ఇంగ్లిష్ అనుసంధాన భాష, కానీ ముస్లింలను బుజ్జగించడానికి మాత్రం ఉర్దూను నెత్తిన పెట్టుకోవడానికి ఈ స్టాలిన్ అనే విధ్వంసక శక్తి, అతడి పార్టీకి అభ్యంతరం లేదు. దేశంలో ఉర్దూ మాట్లాడేవాళ్ల సంఖ్య 5.07 కోట్లు, అంటే 4.19 శాతం. చాలాచోట్ల ముస్లింలు కూడా ఉర్దూ మాట్లాడరు. ఇక్కడ అర్థమవుతుంది స్టాలిన్ దుర్బుద్ధి.
స్టాలిన్ రాజకీయాలు చేస్తున్నారే తప్ప, నిజంగా తమిళం మీద, తమిళుల మీద అభిమానంతో మాట్లాడడం లేదని జోహెూ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వంటివారు అంటున్నారు. తమిళనాడు నుంచి తెలివైన ఇంజనీర్లు తయారవుతున్నారు. వారు ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలలో పనిచేయాలంటే హిందీ తప్పనిసరి. కాబట్టి హిందీని అంతగా ద్వేషించడం మంచిది కాదని హితవు చెబుతున్నారు. ద్రవిడ రాజకీయాలు ఒకప్పుడు తమిళం కోసమంటూ దేశ ఐక్యతకు ముప్పు తెచ్చే తీరులో వ్యవహరించాయి. ఇప్పుడు కుటుంబం కోసం స్టాలిన్ ఆ పని చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ సంగతి తమిళులు, అక్కడి హిందువులు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది.





