
పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో మూడు దశాబ్దాల కులవివక్షకు దళితులు ముగింపు పలికారు. 300 ఏళ్ల తరువాత 130 దళిత కుటుంబాలు తమ ఇష్టదైవం ఆలయంలోకి ప్రవేశించాయి. పూర్బా బర్ధమాన్ జిల్లాలోని గిద్దేశ్వర్ శివాలయం ఈ చారిత్రాత్మక సన్నివేశానికి వేదికైంది. కత్వా సబ్ డివిజన్‌లోని గిద్‌గ్రామ్ గ్రామంలోని దస్పార ప్రాంతానికి చెందిన ఐదుగురు సభ్యుల బృందం ఉదయం 10 గంటల సమయంలో ఆలయం మెట్లు శివలింగంపై పాలు, నీరు పోసి మహదేవునికి అభిషేకం చేశారు.
దాస్ ఇంటి పేర్లు కలిగిన దళిత కుటుంబాలు చెప్పులు కుట్టడం, నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే స్థానికంగా ఉన్న గిద్దేశ్వర్ శివాలయం 300 ఏళ్ల కిందట స్థాపించారు. అప్పటి నుంచి వీరికి ఆలయంలోకి ప్రవేశం లేదు. శివుడిని పూజించేందుకు అనుమతించాలని మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు.
దీంతో దళితులు స్థానిక యంత్రాంగం, పోలీసుల సహాయం కోరారు. దస్పారా గ్రామస్తులతో పలుమార్లు చర్చలు జరిపిన పోలీసులు.. సమస్యను పరిష్కరించారు. అంతేకాదు దళితుల నుంచి పాలను కూడా సేకరించాలని పాలకేంద్రాలను పోలీసులు ఆదేశించారు. అలా యంత్రాంగం, పోలీసుల జోక్యంతో దళితులు ఆలయంలో పూజలు చేశారు. పూజలు చేసే హక్కు లభించినందుకు సంతోషంగా ఉందని, అందరూ బాగుండాలని దేవుడిని కోరుకున్నానని సంతోష్ దాస్ అనే వ్యక్తి తెలిపారు.
ఆలయంలోకి దళితుల ప్రవేశంతో పెద్ద ప్రతిష్టంభన తొలగిందని ఇది స్వాగతించాల్సిన విషయమని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అపూర్వ ఛటర్జీ అన్నారు.





