
ఆకాశంలో అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. ఈ ఏడాదిలో మొదటి గ్రహణం ఈ వారంలోనే సంభవించనుంది. ఈ సంవత్సరం మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనుండగా వాటిలో మొదట చంద్రగ్రహణం సంభవించనుంది. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం. దీనిలో విశేషం ఏంటంటే.. కొన్ని గంటల పాటు ఆకాశంలో కన్పించనున్న దీన్ని ‘బ్లడ్ మూన్’గా చెబుతున్నారు. ఎందుకంటే ఈ గ్రహణం ఏర్పడిన సమయంలో చంద్రుడు బ్లడ్ కలర్లో కన్పిస్తాడు. ఇది భారత కాలమానం ప్రకారం మార్చి 14 (శుక్రవారం) ఉదయం జరుగుతుంది.
ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం: ఇదే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 6 గంటల 3 నిమిషాల పాటు కొనసాగనుంది. అయితే ఇది మన దేశంలో కన్పించదు. ఎందుకంటే మన దేశంలో ఈ గ్రహణం ఉదయం వేళల్లో సంభవిస్తుంది. ఈ గ్రహణం మన దేశంలో మార్చి 14న ఉదయం 9.27 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగనుంది. EDT సమయం ప్రకారం ఈ చంద్రగ్రహణం మార్చి 13న రాత్రి 11.57 గంటలకు ప్రారంభమై మార్చి 14న ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. EDT సమయం భారత సమయం కంటే 9.5 గంటలు వెనకబడి ఉందని గమనించాలి.
మరి ఈ గ్రహణం ఎక్కడ కన్పిస్తుంది?: భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం పగటిపూట సంభవిస్తుంది కాబట్టి ఇది మన దేశంలో కన్పించదు. ఉత్తర, దక్షిణ అమెరికా నుంచి భూమి నైట్ సైడ్ బాగా కన్పిస్తుంది. ఇది ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కూడా కన్పిస్తుంది. ఇక ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న సంభవిస్తుంది. ఇది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం మన దేశంలో కూడా కన్పిస్తుంది.
అసలు చంద్ర గ్రహణం ఎలా ఏర్పడుతుంది?: సూర్యుడు, చంద్రుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంది. అప్పుడు భూమి నీడ చంద్రుని ఉపరితలంపై పడుతుంది. దీంతో చంద్రునిలోని కొన్ని భాగాలు చీకటిగా మారుతాయి.
బ్లడ్ మూన్ ఎందుకు, ఎలా ఏర్పడుతుంది?:
నాసా అందించిన సమాచారం ప్రకారం.. మార్చి 14న సంభవించే చంద్రగ్రహణం ‘బ్లడ్ మూన్’గా మారనుంది. సూర్యుడు, చంద్రుడి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఆ సమయంలో చంద్రుడు ఉంబ్రా (భూమి నీడ)లో ఉంటాడు. దీంతో డైరెక్ట్ సన్లైట్ చంద్రుడిని చేరుకోదు. సూర్యకాంతిలో తక్కువ తరంగదైర్ఘ్యాలు (WaveLength) కలిగిన బ్లూ లైట్ సులభంగా చెల్లాచెదురుగా పోతుంది. కానీ రెడ్, ఆరెంజ్ కాంతి.. దీర్ఘ తరంగదైర్ఘ్యాల వలె భూమి దట్టమైన వాతావరణంలోకి చొచ్చుకుపోయి చంద్రుని ఉపరితలం చేరుకుంటుంది. ఈ నారింజ, ఎరుపు రంగులు భూమిపై పడటం వల్ల అది బ్లడ్ కలర్లో కనిపిస్తుంది.
వివిధ రకాల ‘సంపూర్ణ చంద్ర గ్రహణాలు’: చంద్రుడు.. సూర్యుడి నుంచి భూమికి ఎదురుగా ఉన్నప్పుడు పౌర్ణమి సంభవిస్తుంది. అంటే భూమి.. సూర్యుడికి, చంద్రుడికి మధ్య ఉంటుంది. దీని అర్థం మనం చూసే చంద్రుని మొత్తం భాగం సూర్యకిరణాల ద్వారా పూర్తిగా ప్రకాశిస్తుంది. ఆ రాత్రి సమయంలో ఆకాశంలో అది గుండ్రంగా, ప్రకాశవంతంగా కన్పిస్తుంది. ఇక మనకు తెలిసిన కొన్ని సంపూర్ణ చంద్ర గ్రహణాలలో బ్లడ్ మూన్, సూపర్ మూన్, బ్లూ మూన్, హార్వెస్ట్ మూన్ ఉన్నాయి.
సూపర్ మూన్: ఈ సమయంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. ఇది భూమికి దగ్గరగా ఉండటం వల్ల ఇది సాధారణం కంటే 14% పెద్దదిగా, 30% ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
బ్లూ మూన్: ఇది ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 1940 నుంచి క్యాలెండర్ నెలలో వచ్చే రెండవ పౌర్ణమిని ‘బ్లూ మూన్’గా అని పిలుస్తారు.
హార్వెస్ట్ మూన్: ఈ మూన్ శరదృతువు కాలంలో సెప్టెంబర్ 22-23 తేదీల్లో ఆకాశంలో కన్పిస్తుంది. ఇది రైతులకు వారి పంట కోతకు అదనపు కాంతిని అందిస్తుంది. అందుకే దీన్ని ‘హార్వెస్ట్ మూన్’ అని పిలుస్తారు.





