
భారతదేశం కేవలం భూమి కాదని, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విశ్వగురు, ఆధ్యాత్మిక నిధి, జీవన వేదాంత శాస్త్రమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్‌కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పంచశీల బాలక్ ఇంటర్ కాలేజీ వేదికగా సురుచి ప్రకాశన్ ప్రచురించిన “విమర్శ్ భారత్ కా” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దత్తాత్రేయ హోసబాలే పాల్గొని ప్రసంగించారు. వలస పాలన, వామపక్ష వక్రీకరణలతో భారత్ తన గుర్తింపును కోల్పోయిందన్నారు. దాన్ని తిరిగి సాధించేందుకు సైద్ధాంతిక పోరు జరపాలని హోసబాలే గారు పిలుపునిచ్చారు. భారతదేశ చారిత్రక కథనంలో పొందుపరిచిన అబద్ధాలను ఈ సందర్భంగా ఆయన బహిర్గతం చేశారు. భారతదేశం అంటే కేవలం భౌగోళిక లేక రాజకీయ వ్యవస్థ కాదని స్పష్టం చేశారు. భారతదేశం తన జీవన విధానం ద్వారా మానత్వానికి ఆకారం అందించడమే కాక, నాగరికతకు, సాంస్కృతిక శక్తికి కేంద్రమని సర్‌కార్యవాహ్ స్పష్టం చేశారు.
భారత్‌ను వ్యవసాయాధారిత వెనుకబడిన దేశంగా వలసపాలకులు చేసిన చిత్రీకరణను దత్తాత్రేయ హోసబాలే నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతూ, 1600 A.D.లో ప్రపంచ వాణిజ్యంలో భారత్ 23 శాతం వాటా కలిగి ఉందనే వాస్తవాన్ని తెలియజేశారు. భారత్ అన్ని రంగాలలో ముందంజలోనే ఉందన్నారు. మన విద్యా వ్యవస్థ నాశనం అయిందని, మన చరిత్ర వక్రీకరణకు గురైందని, ఆక్రమణదారుల చేతిలో మన ఆత్మగౌరవం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేసిన దత్తాత్రేయ హోసబాలే మనకే సొంతమైన నాటి సత్యాన్ని తిరిగి పొందాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మన దేశాన్ని ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని బలంగా చెప్పారు. ఎందుకంటే ఇది భాషకు సంబంధించిన విషయం కాదని సాంస్కృతిక, నాగరికత పునరుద్ధరణకు సంబంధించిన అంశమని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా నేడు సైద్ధాంతిక పోరు జరుగుతోందని, కావున ప్రపంచం ఎదుట సత్యాన్ని ఆవిష్కరిస్తూ భారత్ సైతం పోరాటం చేయాలని ఆర్.ఎస్.ఎస్. సర్‌కార్యవాహ్ తెలిపారు. భారత్ లక్ష్యం దేశ సరిహద్దులకు అతీతంగా విస్తరించి ఉందన్నారు. “ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయ చ” అంటే మన స్వీయ మోక్షంతో పాటు లోక సంక్షేమం కోసం పాటుపడాలని మన ఋషులు ప్రకటించారని, యావత్ ప్రపంచం భారత్ యొక్క మార్గనిర్దేశం కోసం ఎదురు చూస్తోందన్నారు. భారత్‌కే సొంతమైన “సర్వే భవన్తు సుఖిన:”, “వసుదైక కుటుంబం” వంటి సాంస్కృతిక పద్ధతులు, నైతిక ప్రమాణాలను ఆవాహం చేసుకొని ప్రపంచానికి దారి చూపాల్సిన అనివార్యత ఉందని ఇందుకు శక్తి, స్వయం సమృద్ధి, మేధోపరమైన స్పషత ఉండాలని దత్తాత్రేయ హోసబాలే విశదీకరించారు.





