News

అయోధ్య నగర పాలికకు పాదరక్షల సమస్య.. వట్టికాళ్లతోనే వెళ్లిపోతున్న భక్తులు

317views

ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళా భక్తుల రద్దీ అయోధ్యను కూడా తాకడంతో స్థానిక నగర పాలికకు గత నెల రోజులుగా గుట్టలుగా పేరుకుపోతున్న చెప్పుల తొలగింపు పెద్ద సమస్యగా మారింది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు విడిచిపెడుతున్న పాదరక్షల తరలింపునకు అధికారులు పొక్లెయిన్లు, ట్రాలీలను వాడాల్సి వస్తోంది. ఆలయంలోకి రాక, పోకల నిబంధనలు మార్చడమే ఈ సమస్యకు కారణం. ఆలయ ప్రవేశంలో ఉన్న మొదటి గేటు వద్ద భక్తులు చెప్పులు విడిచిపెడతారు. గుడి లోపల దాదాపు అర కిలోమీటరు మేర ఉన్న వృత్తాకార మార్గాల్లో తిరిగి, దర్శనానంతరం మళ్లీ అదే గేటు నుంచి ఇదివరకు బయటకు వెళ్లేవారు. నెల రోజులుగా విపరీతమైన రద్దీ ఉండటంతో 3వ నంబరు గేటు నుంచి బయటకు పంపుతున్నారు. మళ్లీ మొదటి గేటు వద్దకు వచ్చి చెప్పులు తీసుకోవాలంటే అయిదారు కిలోమీటర్లు నడవాలి. దీంతో చాలామంది వట్టికాళ్లతోనే వెళ్లిపోతున్నారు.