
354views
గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో గల ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సోమనాథ లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పొరుగున గల జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయారణ్య ప్రధాన కేంద్రం సాసన్‌కు వెళ్లారు. ఈ ప్రాంతం ఆసియా సింహాలకు నెలవై ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో మహా కుంభమేళా కోట్లాది మంది దేశ ప్రజల భాగస్వామ్యంతో ముగిసినట్లు ప్రధాని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఒక సేవకుడిగా.. మహా కుంభోత్సవం తర్వాత సోమనాథ్ ఆలయానికి వస్తానని అనుకున్నాననీ.. ఇందులో భాగంగానే సోమనాథుడిని దర్శించుకొని తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం, శ్రేయస్సును ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు.





