
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాల్లో చివరి ఘట్టం వంశధార నదిలో జరిగిన చక్ర తీర్థ స్నానంతో ముగిశాయి. చక్ర తీర్థ స్నానాల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే ఈ త్రిశూల స్నానం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సుమారు 950 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించారు. ముందుగా అర్చకులు నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను సిద్ధం చేసి.. ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వామి వారికి పుణ్య స్నానం చేశారు. వంశధార నదిలో మిరియాబిల్లి రేవు వద్ద పార్వతీ పరమేశ్వరుల కు చక్రవాక పక్షులు తరహాలో స్నానం చేసి.. ప్రత్యేక పూజలు చేశారు.. ఆ సమయంలో స్నానం చేసిన వారికి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒడిస్సా రాష్ట్రం నుండి.. వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.. ఈ మహా క్రతువులో పాల్గొనే భక్తులకు దేవస్థానం అన్న ప్రసాదాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కుంభమేళాను తలపించే రీతిలో వంశధార నదికి ఇరువైపులా చక్ర తీర్థ స్నానాలు జరిగాయి.





