ArticlesNews

పల్నాటి సీమలో ప్రభాత సూర్యుడు కన్నెగంటి హనుమంతు

350views

( ఫిబ్రవరి 26 – కన్నెగంటి హనుమంతు వర్ధంతి )

పుల్లరి.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా. మన భారతదేశంలో ఒకప్పుడు పశువులకాపర్లను, రైతులను బ్రిటీషు వారు పెట్టిన క్షోభ అంతా ఇంతా కాదు. ఎవరైనా జనులు తమ వద్ద ఎలాంటి పశువున్నా… దానికి శిస్తు కట్టాల్సిందే. ఆ శిస్తుకే పుల్లరి అని పేరు పెట్టారు. ఈ విధానాన్ని తొలిసారిగా ఎదిరించిన వ్యక్తి ఓ తెలుగువాడు కావడం విశేషం. ఆయనే కన్నెగంటి హనుమంతు. పుల్లరి చెల్లింపును ధిక్కరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన నాయకుడు.

కన్నెగంటి హనుమంతు 1870 జూన్‌లో జన్మించారు. తండ్రి పేరు వెంకటయ్య. తల్లి పేరు అచ్చమాంబ. వీరిది వ్యవసాయ కుటుంబం. గ్రామాధికారుల ఆగడాలను చూస్తూ పెరిగిన హనుమంతు ప్రజల జీవన పరిస్థితులను మార్చడానికి ఆరాటపడేవారు. ఊరందరి అవసరాలను తీర్చేవారు. గాంధీజీ పిలుపుమేరకు సహాయ నిరాకరణోద్యమంలోకి దూకిన కన్నెగంటి హనుమంతు మించాలపాడు కేంద్రంగా పుల్లరి ఉద్యమాన్ని నడిపారు. కన్నెగంటి నాయకత్వంలో ప్రజలు అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను సాంఘిక బహిష్కారానికి గురి చేశారు. పుల్లరి చెల్లించడం లేదని 18 మంది రైతులకు బేడీలు వేసి ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ప్రజలు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశారు. బ్రిటిష్ అధికారులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా హనుమంతు లొంగకపోవడంతో 1922లో మద్రాసు నుంచి ప్రత్యేక కలెక్టరుగా రూథర్‌ఫర్డ్‌ను బ్రిటిష్ అధికారులు నియమించారు. ఇతడి సారథ్యంలో బ్రిటిష్ సైనికులు గుర్రాలపై ఒక్కో గ్రామానికి చేరుకుంటూ విధ్వంసం సృష్టించినా ఫలితం కనిపించలేదు. దీంతో హనుమంతును ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించారు.

దుర్గి ప్రాంతంలోని చుట్టు పక్కల 45 గ్రామాలను కలిపి ఎస్టేట్‌గా మారుస్తాం. జమిందారును చేస్తాం. ప్రజలపై ఎన్ని పన్నులైనా వేసుకో..మాకు మాత్రం నామమాత్రం చెల్లిస్తే చాలు అని బ్రిటిషర్లు కన్నెగంటి హనుమంతుకి ఆశపెట్టారు. తన ప్రజలను రాబందులకు అప్పజెప్పనని ఈ మహావీరుడు తెగేసి చెప్పేశాడు. దీంతో హనుమంతును హతమార్చడం ద్వారానే ఉద్యమాన్ని ఆపవచ్చని నిర్ణయించుకున్న రూథర్‌ఫర్డ్ అందుకు పన్నాగం పన్నాడు. 1922 ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో గ్రామప్రజలు నిమగ్నమై ఉన్న సమయంలో బ్రిటిష్ సైన్యం మించాలపాడు గ్రామంపై విరుచుకుపడి పశువుల్ని నిర్బంధించడం మొదలు పెట్టింది. రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై బ్రిటిష్ మిలటరీ దాడి చేసింది. విషయం తెలుసుకున్న కన్నెగంటి హనుమంతు ప్రజలందరి పన్నును తానే చెల్లిస్తానని ముందుకు వచ్చాడు.

పుల్లరి చెల్లిస్తామని అధికారులతో చర్చించేందుకు వచ్చిన కన్నెగంటి హనుమంతు పై బ్రిటిష్ మిలటరీ కాల్పులు జరిపింది. బ్రిటిష్ వారి కాల్పుల్లో 26 తూటాలు ఆయన శరీరంలోకి దూసుకుపోయాయి. ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన దాహం తీర్చేందుకు భార్య గంగమ్మ తీసుకొచ్చిన నీటికుండను సైతం పోలీసులు పగులగొట్టారు. చివరికి వందేమాతరం అని నినదిస్తూనే ఫిబ్రవరి 26 అర్థరాత్రి కన్నెగంటి హనుమంతు కన్నుమూశాడు. వందేమాతరం అని గర్జిస్తూ ప్రాణాలు వదిలిన కన్నెగంటి హనుమంతు స్ఫూర్తితో ఎందరో స్వాత్రంత్ర్యోద్యమ సమరంలో పాల్గొన్నారు. బ్రిటిష్ అధికారుల పట్ల పల్నాటి ప్రజలు అనుసరించిన సాంఘిక బహిష్కరణ విధానం తక్కిన దేశానికంతటికి దారి చూపింది. కన్నెగంటి హనుమంతు జీవితం భావితరాలకు ఆదర్శం.