
పాకిస్తాన్ ను కూడా భారత్ లా అభివృద్ధి చేస్తానని, లేదంటే తన పేరు షెహబాజ్ షరీఫే కాదంటూ బీరాలు పలికిన పాక్ ప్రధానికి నిరసన సెగలు తగులుతున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్ లో తీవ్ర నిరసనలు ప్రారంభమయ్యాయి. హైడల్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. హైడల్ ప్రాజెక్టుల వల్ల తీవ్రంగా నష్టపోయిన వేలాది మంది పాక్ ప్రధానిని తిట్టిపోస్తున్నారు. వేలాది మంది నష్టపోయాయమని, ఇంకా నష్టపరిహారం ఇవ్వడం లేదని, ప్రభుత్వం విఫలమైందని దుమ్మెత్తి పోస్తున్నారు.
దాసు హైడ్రో పవర్ ప్రాజెక్టు (DHPP) తో నష్టపోయిన వారు ప్రధాని షెహబాజ్ కి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. నష్ట పరిహారం ఇవ్వకుండానే తమ భూములు లాగేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది నిర్వాసితులు రోడ్డెక్కి, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
వందలాది ఇళ్లను ప్రభుత్వం నేలమట్టం చేసిందని, పునరావాసం కల్పించకుండానే కూల్చేస్తారా? అంటూ ప్రభుత్వంపై మండిపోతున్నారు. తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసి, భూములను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. బలవంతంగా ఖాళీ చేయించి, చైనా ఇంజినీర్లకు అప్పగించేశారన్నారు.
తమ 13 న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామంటూ మొదట్లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరసన కారులు పేర్కొన్నారు. అయితే.. ఈ లిఖిత పూర్వక హామీలను నేటికీ అమలు చేయడం లేదని, తమ జీవితాలతో పాక్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో, డైమర్-బాషా హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా గిల్గిట్-బాల్టిస్తాన్ (GB)లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. చిలాస్‌లో గత వారం రోజులుగా వేలాది మంది నిరసనకారులు నిరసన దీక్షలు చేస్తున్నారు. తమకు పునరావాసం కల్పించాలని, స్థానికులకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాము 31 డిమాండ్లను ప్రభుత్వం ముందు వుంచామని, వాటి గురించి ఉలుకూ పలుకూ లేనే లేదని అంటున్నారు.
దాసు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనకారులు ప్రధానంగా కోహిస్తాన్ నిరసనకారులు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందుకు నిరసనకు దిగారు. అక్కడే బైఠాయించారు. వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ (వాప్డా) 4,700 మెగావాట్ల దాసు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌పై తన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోమిల, దాసు బజార్లలో ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లతో కూడిన బ్యానర్లను కూడా వుంచారు. నీటి, విద్యుత్ డెవలప్ మెంట్ అథారిటీ తమ డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు.





