ArticlesNews

ఆధునిక రుషుల తపోవనం

293views

స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఒకటైన రామకృష్ణ మిషన్‌ అటు ఆధ్యాత్మిక చింతన..ఇటు సమాజం పట్ల బాధ్యతతో సేవలందించడమే కాకుండా విద్య, వ్యవసాయం, విలువలను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది.వైయస్సార్ జిల్లా కడపలోని చెన్నూరు బస్టాండ్‌ సమీపంలో 1910లో రామకృష్ణ సమాజాన్ని ఏర్పాటు చేశారు. అందులో గ్రంథాలయాన్ని నిర్వహించారు. 1992లో రామకృష్ణ సేవా సమితిని భక్తులంతా కలిసి ఏర్పాటు చేసుకున్నారు.

2004 నుంచి దానిని రామకృష్ణ మఠంలో మార్చారు. రెండతస్తుల్లో గ్రంథాలయం, ఆధ్యాత్మిక బోధనలు నిర్వహించారు. 2007లో పుట్లంపల్లె వద్ద మఠం నిర్మాణానికి స్థలం ప్రభుత్వం స్థలం ఇవ్వడంతో అందులో 2007లో రామకృష్ణ మిషన్‌ ఏర్పాటైంది. పేదలు, అనాథ బాలలతో బాలకాశ్రామం నిర్వహిస్తున్నారు. వివేకానంద విద్యానికేతన్‌ పేరిట 7వ తరగతి వరకు మిషన్‌ ఆవరణంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. అదే ఆవరణంలో వివేకానందుని పేరిట భారీ ఆడిటోరియం ఏర్పాటు చేశారు.

ఇందులో ఆధ్యాత్మిక, సామాజిక సభలను కొనసాగిస్తున్నారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా స్వామిజీ, బ్రహ్మచారుల గృహాలున్నాయి. ఆశ్రమమంతా నిరంతరం ప్రశాంతంగా పూల, పండ్ల తోటలతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పుస్తకాల విక్రయాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2012లో ఏర్పాటు చేసిన విశ్వజనీన ఆలయం రామకృష్ణ మిషన్‌­కు తలమానికంగా నిలు­స్తోంది.

ఇందు­లో అన్ని మతాలకు చెందిన చిత్ర­పటాలు, వారు తమ మతా­చారం ప్రకారం ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా వేదికలు ఉంటాయి. సేవలు–మిషన్‌ ఆధ్వ­ర్యంలో ‘విద్య’ పేరిట నైతిక విలు­వలుగల విద్యాబోధన గురించి పాఠశాలలు, కళాశాలల్లో మిషన్‌ ప్రతినిధులు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆశ్రమ ఆవరణంలో యేటా రెండు­మార్లు మూడు నుంచి వారం రోజులపాటు యువ రైతు­లకు పంటలు, దిగుబడిపై నిపుణులైన వారితో శిక్షణా కార్య­క్రమా­లను నిర్వ­హిస్తున్నారు.

యేటా ఉపాధ్యా­యుల­కు విలువలుగల విద్యాబోధనపై మూడు రోజుల­పాటు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 18న జరిగిన రామకృష్ణ పరమహంస జయంతి నేపథ్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు.