News

క్రైస్తవ మతమార్పిడికి నిరాకరించిన దళిత కుటుంబంపై సామాజిక బహిష్కరణ

491views

క్రైస్తవ మతమార్పిడిని నిరాకరించినందుకు తమ కుటుంబాన్ని గ్రామస్థులు బహిష్కరించారని భద్రాద్రి కొత్తగూడెం మనుగూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన గంటా రాధా ఆరోపించారు. చర్చ్ నాయకులు తమను బహిష్కరించడమే కాకుండా, తన అన్నను మోసం చేసి బలవంతంగా మతపూజల్లో కూర్చోబెట్టారని తెలిపారు. ఈ ఘటనలో అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందని రాధ వాపోయారు.

బాధితురాలు రాధ ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 20న కేసు పోలీసులు నమోదు చేసి, బాధితురాలు పేర్కొన్న 17 మంది చర్చ్ సభ్యులపై క్రింది సెక్షన్ల కింద కేసులు పెట్టారు: (PCRA) సెక్షన్ 4 , BNS సెక్షన్ 296(b), (BNS) సెక్షన్ 190 –

“హిందూ దేవుళ్లను అపహాస్యం చేయడాన్ని ప్రశ్నించాననే మా కుటుంబాన్ని బహిష్కరించారు” అని గంటా రాధ స్పష్టం చేశారు. గంటా రాధా కథనం ప్రకారం, చర్చ్ సభల్లో హిందూ దేవుళ్లను కించపరచడాన్ని తాను ప్రశ్నించినప్పుడే సమస్య మొదలైంది.

“చర్చ్ సభల్లో రాముడు… దున్నపోతు… లాంటి మాటలు వాడుతూ హిందూ దేవుళ్లను కించపరచేవారు. రాత్రి 11 గంటలకు శబ్దాన్ని ఎక్కువ చేసి హిందువుల నిద్ర భంగం కలిగించేవారు” అని రాధ ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా, గ్రామ చర్చ్ కమిటీ తమ కుటుంబాన్ని బహిష్కరించాలనే తీర్మానం తీసుకుందని చెప్పారు. “నా బంధువులు సైతం మాతో మాట్లాడటం మానేశారు. పాల వ్యాపారులు పాలు అమ్మడం మానేశారు. కిరాణా దుకాణాలు మాకు సరుకులు అమ్మలేదు. మున్సిపల్ అధికారులు మా ఫిర్యాదులను పట్టించుకోలేదు” అని ఆమె వాపోయారు.

పోలీసుల నిర్లక్ష్యం – గ్రామస్థుల సామూహిక బహిష్కరణ…
ఈ ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేసినా, స్పందన లభించలేదని గంటా రాధా వాపోయారు. గ్రామానికి వచ్చిన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు పరిస్థితిని పరిశీలించినా, ఎలాంటి చర్య తీసుకోలేదని, ఆ తర్వాత సీఐ సోమవారం విచారణ నిర్వహించినప్పుడు, చర్చ్ నాయకులు తమ కుటుంబాన్ని బహిష్కరించేందుకు తీర్మానం చేసిన విషయాన్ని బహిరంగంగా అంగీకరించారని రాధ చెప్పారు. “ఈ సామాజిక బహిష్కరణలో 76 మంది ఎస్సీ మాల కుటుంబాలకు చెందిన 300 మంది పాల్గొన్నారు” అని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ, పోలీసుల స్పందన మందకొడిగా ఉండటంతో, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

“ఆరోగ్య సమస్యకు మిరాకిల్ ప్రేయర్” పేరిట మా అన్నను మోసం చేసి బలవంతంగా మతపూజలో కూర్చోబెట్టారని గంటా రాధా ఆరోపించారు. కుటుంబానికి ఎదురైన సమస్య ఆమె అన్నపై బలవంతపు మతపూజలు జరిపించినప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. “ఆరోగ్య సమస్యకు మిరాకిల్ ప్రేయర్ చేస్తామని చెప్పి చర్చ్‌కు తీసుకెళ్లారు. కానీ అక్కడ మద్యం ఇచ్చి మతపూజలో కూర్చోబెట్టారు” అని గంటా రాధా ఆరోపించారు. కొద్దిసేపటికే ఆయన రక్తం వాంతి చేయడం ప్రారంభించాడని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా, అప్పటికే పరిస్థితి విషమించిపోయిందని, ఉదయం 7 గంటలకు ఆసుపత్రిలో చేర్పించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని ఆమె చెప్పారు.

క్రైస్తవ ఆటో డ్రైవర్లు కూడా తమపై బహిష్కరణ విధించారని బాధితురాలు గంటా రాధా ఆవేదన చెందారు. తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. “గ్రామంలో క్రైస్తవ ఆటో డ్రైవర్లు మమ్మల్ని ప్రయాణం చేయనివ్వడం లేదు. మా ఇంటికి ఎవ్వరూ రాలేకుండా చేశారు” అని ఆమె వాపోయారు. “హిందూ సంఘాలు మాకు అండగా నిలవాలి. న్యాయం జరిగేలా చూడాలి” అని గంటా రాధా విజ్ఞప్తి చేశారు.