ArticlesNews

విశ్వగురు స్థానానికి చేరుకుంటాం… మన కళ్లతోనే చూస్తాం : మోహన్ భాగవత్

335views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశవ్యాప్తంగా విస్తరించిందని, రోజు రోజుకీ సంఘ్ కార్యం వృద్ధి చెందుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఆరెస్సెస్ కార్యాలయాన్ని (కేశవ కుంజ్) ను మోహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన భవనం లాగే సంఘ కార్యం కూడా అద్భుతంగా జరగాలని, అది ప్రపంచానికి ప్రస్ఫుటంగా ద్యోతకం కావాలన్నారు. సంఘ్ కార్యం ప్రపంచం మొత్తానికి చేరుతుందని, ఈ కార్య పద్ధతే భారత్ ను తిరిగి విశ్వగురు స్థానానికి తీసుకెళ్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

త్వరలోనే భారత్ విశ్వగురు స్థానానికి చేరుకుటుందని, ఈ జన్మలోనే మనమందరమూ దీనిని చూస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. దీని కోసం స్వయంసేవక్ నిస్వార్థ బుద్ధితో పనిచేయాలని, లక్ష్యానికి కటిబద్ధుడై వుండాలని సూచించారు. సంఘ కార్యకలాపాలు అనేక కోణాల్లో విస్తరిస్తున్నాయని, ఈ నేపథ్యంలో స్వయంసేవక్ అత్యంత స్వచ్ఛంగా, ప్రామాణికంగా, నిస్వార్థంగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి వుండాలని పిలుపునిచ్చారు.

గత కష్ట సమయాలతో పోల్చుకుంటే సంఘ పరిస్థితి బాగా మెరుగైందని, అయితే.. దిశ మారకుండా జాగ్రత్త పడాలన్నారు. శ్రేయస్సు అనేది కావాల్సిందేనని, అయితే.. అది కొన్ని పరిమితులకు లోబడాలన్నారు. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన కేశవ కుంజ్ నిస్సందేహంగా గొప్ప భవనమని, అయితే ఈ గొప్పదనంతో బాధ్యత కూడా పక్కకు వచ్చి చేరుతుందన్నారు. ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి తదనుగుణంగా కార్యక్షేత్రంలో స్వయంసేవకులు పనికూడా చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా మోహన్ భాగవత్ తన ఉపన్యాసంలో ఆద్య సరసంఘచాలక్ కేశవరాం బలిరాం హెడ్గేవార్ గురించి ప్రస్తావించారు. సంఘ్ ప్రారంభంలో ఆయన సంఘ విస్తరణ కోసం చేసిన కష్టాలను గుర్తు చేశారు.ఢిల్లీ దేశ రాజధాని అని, అనేక కార్యకలాపాలకు కేంద్ర బిందువు అని అన్నారు. అందుకే సంఘ అవసరాల దృష్ట్ట్యా భవన నిర్మాణం జరిగిందన్నారు.

కొత్త భవన నిర్మాణం జరిగింది కానీ.. సంఘ కార్యం ఇక్కడే ఆగిపోదన్నారు. విమర్శలు, వ్యతిరేకతలు కూడా వున్నాయని, అప్రమత్తంగా వుండాలన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. సానుకూల వాతావరణం నిర్మాణం చేసుకుంటూ.. కార్యాన్ని విస్తరించాలని సూచించారు.సంఘ కార్యాన్ని విస్తరించడానికి ఈ నూతన భవనం ప్రేరణగా నిలుస్తుందని, సానుకూల వాతావరణంలో స్వయంసేవకులు పనిచేస్తూ ముందుకు సాగాలన్నారు.