News

రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులు గంట ముందు వెళ్ళిపోవచ్చు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

229views

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రంజాన్ నెలలో గంట ముందు వెళ్ళిపోయేందుకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఆ ఆదేశాలు మార్చి 2 నుంచి 30 వరకూ అమల్లో ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు, ప్రభుత్వంలోని సాధారణ పరిపాలనా విభాగం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రంజాన్ నెంలలో ముస్లిములకు అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉండేలా మరికొన్ని నిర్ణయాలతో ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

రంజాన్ నెల సందర్భంగా ప్రజారోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించేందుకు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తగిన శానిటేషన్ సౌకర్యం కల్పించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. మసీదులు, ఈద్‌గాలు, ముస్లిం ప్రాంతాల్లో తాగునీటికి, విద్యుత్తుకు అవాంతరాలు రాకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు.

రంజాన్ సందర్భంగా దుకాణాలు, కూరగాయల సంతలు, హోటళ్ళు తెరిచి ఉంచే సమయాలను పొడిగించారు. రాత్రి వేళల్లోనూ, తెల్లవారుజాము సమయాల్లోనూ దుకాణాలన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులకు సూచించారు.

మసీదుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు. మసీదుల్లో ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ఫిర్యాదులూ రావడానికి వీల్లేదని హెచ్చరించారు.