
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మొత్తం హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలనుకుంటోందని (ఏకం చేయడం) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రకటించారు. సంఘ్ ఏం చేయాలనుకుంటోందని చాలా మంది అడుగుతుంటారని… ఏక వాక్యంలో చెప్పాల్సి వస్తే ‘‘హిందూ సమాజాన్ని ఏకం చేయాలనుకుంటోంది’’ అని, ఇదే సమాధానమని పునరుద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ సమాజానికి హిందువులే బాధ్యులు కాబట్టి, వారిని ఏకం చేయాలని అనుకుంటున్నామని స్పష్టతనిచ్చారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్దిలోకి ప్రవేశించిన నేపథ్యంలో సంఘ్ గురించి కూడా వివరించారు.
సంఘ్ ని అర్థం చేసుకోవాలంటే దూరం నుంచి గమనిస్తే కుదరదని, దానిలో భాగస్వామ్యం అయినప్పుడే సంఘ్ అర్థమవుతుందన్నారు. సంఘం ఏది ఆశించదని, ఈ భూమి తల్లి కాబట్టి, దానికి సేవ చేస్తూ ధన్యత పొందుతున్నామన్నారు. అపారమైన ఆత్మీయతతో సంఘ్ పనిచేస్తోందన్నారు. శుద్ధ సాత్విక ప్రేమ ఆధారంగా సంఘం పనిచేస్తోందని వివరించారు. దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడానికి పని చేస్తున్నామని తెలిపారు. సన్మానాలు, ధన్యవాదాలు, రాజకీయాలు, అలాంటివేమీ సంఘ్ కార్యకర్తలకు అవసరం లేదని, దేశం పరమ వైభవ స్థితికి చేరుకుంటే చాలని స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అని సంఘ్ ని పిలుస్తారని, కానీ.. అలా ఎందుకు ఎదగాలని అనుకుంటున్నాం? మన స్వార్థం కోసం కాదని, పేరు కోసం కాదని, సమాజం ఐక్యంగా వుంటేనే ప్రపంచానికి ఉపయోగపడతాం అని తెలిపారు. హిందూ సంఘటనమే సంఘ్ ప్రధాన ధ్యేయమని పునరుద్ఘాటించారు. ఇలాంటి వ్యక్తులను నిర్మాణం చేయడమే సంఘ్ పని అని తెలిపారు.
స్వయం సేవక్ అందర్నీ కలుపుకొని వెళ్తాడని, తనకంటూ ప్రత్యేక సర్కిల్ అంటూ ఏదీ వుండదన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లడం అన్న దానిని అభ్యాసం చేస్తుంటారని పేర్కొన్నారు. శాఖ అన్న మాధ్యమం ద్వారా అందర్నీ కలుపుకుంటూ వెళ్తాడని, అప్పుడు సమరసత, ఆత్మీయత నిర్మాణం జరుగుతుందన్నారు. దేశం హితం కోసమే జీవించడం, మరణించడం అన్న కార్యపద్ధతి ఏదైతే వుందో అదో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అని వివరించారు.
భారత్ అనేది కేవలం భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, దానికంటూ ఓ స్వభావం వుందన్నారు. ఈ స్వభావంతో వచ్చే విలువలతో జీవించేలేని వారు ప్రత్యేక దేశాన్ని (పాకిస్తాన్) సృష్టించారన్నారు. అయితే భారత్ లో వైవిధ్యత అన్న లక్షణం వుందని, భిన్నత్వంలో ఏకత్వం వుందని, ఇప్పుడు అందరూ ఈ స్వభావాన్ని కోరుకుంటున్నారన్నది అర్థమవుతోందన్నారు. అయితే ఈ స్వభావం ఈనాడు పుట్టింది కాదని, స్వాతంత్రం సిద్ధించిన సమయంలో ఉద్భవించింది కూడా కాదని, ఈ స్వభావం భారత్ కి అత్యంత పురాతనంగా సిద్ధించిందని వివరించారు.
ఈ సందర్భంగా అలెంగ్జాండర్ సమయం నాటి దండయాత్రలను కూడా ప్రస్తావించారు. సద్గుణాలు లేని కొంత మంది అనాగరికులు భారత్ ను పాలించారని, సమాజంలో అంతర్గతంగా విభజనలు సృష్టించి, ద్రోహం చేశారన్నారు.సమాజంలో మార్పు తీసుకురావాలంటే సమాజం కూడా భాగస్వామ్యం కావాలని, అప్పుడే మార్పు తీసుకురావడం సాధ్యమన్నారు. భారత్ అన్న కల్పనను బ్రిటీషు వారు సృష్టించలేదు… దాంతో పాటు భారత్ ఒకటే కాదు అన్న భావన బ్రిటిష్ సమయంలోనే జొప్పించారన్నారు. భారత్ అనేది శతాబ్దాలుగా ఉనికిలో వుందని, వైవిధ్యత అన్నది వున్నా… ఐక్యంగానే వుందని పేర్కొన్నారు. భారత్ లో వున్నవారందరూ భిన్నత్వంలో ఏకత్వం అన్న ఆలోచనను విశ్వసిస్తారని, ఇప్పుడు దీని గురించి మాట్లాడితే.. హిందుత్వం అని ఆరోపిస్తున్నారని మోహన్ భాగవత్ అన్నారు.





