
సనాతన ధర్మానికి మార్గం చూపించే వేదికగా అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీఎక్స్)-2025 దోహదం చేస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారు కొలువైన ఈ ప్రాంతంలో సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. తిరుమల ఆలయాన్ని చూసి దేవాలయాల నిర్వహణ ఎలా ఉండాలో తెలుసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ హాలులో సోమవారం సాయంత్రం ప్రారంభమైన ఐటీసీఎక్స్-2025 సదస్సుకు ఏపీ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడణవీస్, ప్రమోద్ సావంత్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కేంద్రమంత్రి శ్రీపాద యశోనాయక్, ఆధ్యాత్మిక గురువు ఆచార్య స్వామిగోవిందదేవ్ గిరీజీ మహారాజ్, నిర్వాహకులు ప్రసాద్‌లాడ్, గిరీశ్ వాసుదేవ్ కులకర్ణి, తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, గోవా మంత్రులు విశ్వజిత్ రాణే, ఆశిష్ షెలార్, మహారాష్ట్ర మంత్రి రోహన్ ఖౌంటే, తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, తితిదే ఈవో శ్యామలరావు, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, 58 దేశాలకు చెందిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాల ప్రతినిధులు పాల్గొన్నారు. మంగళ, బుధవారాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగనుంది.
కోట్ల మంది పవిత్ర స్నానాలు
దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడుతూ ‘300 ఏళ్ల క్రితం జన్మించిన రాజమాత అహల్యాదేవి తన పాలనాకాలంలో అనేక మంది దురాక్రమణదారుల ఆగడాలను అడ్డుకున్నారు. సనాతన ధర్మ పునరుజ్జీవనంలో ఆమె కీలక పాత్రధారి. ఛత్రపతి శివాజీ అదే బాటలో నడిచారు. ప్రధాని మోదీ ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. సామాన్యులు సైతం సనాతన ధర్మానికి వారసులమని చెప్పుకొని గర్వపడే పరిస్థితిని మోదీ తెచ్చారు. మహాకుంభమేళాలో 50 కోట్ల మందికిపైగా పవిత్ర స్నానం ఆచరించారు. ఇది అమెరికా, ఐరోపా ఖండాల్లోని కొన్ని దేశాల జనాభాకంటే ఎక్కువ. సనాతన ధర్మంలో ఎలాంటి తారతమ్యాల్లేవు. అనాదిగా వస్తున్న ఈ ధర్మాన్ని ఎవరూ మార్చలేకపోయారు. ఇది శాశ్వతం. ఇదే భారతీయ జీవన విధానం. దేశంలో వైవిధ్యాలున్నా మాలలో అల్లిన పువ్వుల్లా మనం జీవిస్తున్నాం. దక్షిణ భారతదేశంలో అద్భుత దేవాలయాలు, శిల్పకళలున్నాయి. చోళులు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఆలయాల ఖ్యాతి చెక్కుచెదరలేనిది. మన ఆలయాలు విద్యా కేంద్రాలుగా వర్ధిల్లాయి. బ్రిటిషు పాలనా సమయంలో మన దగ్గర 50 వేల సాంస్కృతిక విద్యా కేంద్రాలుంటే, అప్పటికి ఇంగ్లాండ్‌లో రెండు వేలు మాత్రమే ఉన్నాయి. విదేశీ యాత్రికుల్లో 55 శాతం మంది భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునేందుకు వస్తున్నారు. మందిరాల నిర్వహణ, రద్దీ నియంత్రణపై ఐటీసీఎక్స్ శిక్షణ ఇవ్వాలి. తితిదే, మహారాష్ట్రలోని గజానన మహారాజ్ మందిరాలు అందిస్తున్న సేవలను తెలుసుకోవాలి’ అని సూచించారు.
భాష, ప్రాంతం వేరైనా, ఆలయాల సంస్కృతి ఒక్కటే
భాష, వేషం, ప్రాంతం, సంప్రదాయాలు వేరైనా.. దేవాలయాల సంస్కృతి ఒక్కటేనని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘దేశ సంస్కృతిలో భాగంగా గోవాలో గోవుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గోవులను రక్షించే రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నాం. గోరక్షణకు అందరూ పాటుపడాలి. శివాజీ లాంటి రాజులు దైవం, ధర్మం, దేశం నినాదాలతో పాలించారు. శివాజీ మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ సమాజ స్థాపన చేశారు. గోవాలో సప్తకోటీశ్వర ఆలయ పునర్నిర్మాణం చేసిన ఘనత శివాజీది అయితే ఆ గుడిని ప్రజలకు అందించే అవకాశం నాకు దక్కింది. సనాతన ధర్మాన్ని ఆచరించడం మన కర్తవ్యం. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగకరమ’ని పేర్కొన్నారు.
రామాలయ నిర్మాణం మన అస్తిత్వానికి నిదర్శనం
‘మందిరాలు నా దృష్టిలో ప్రార్థన స్థలాలు కావు. భగవంతుని నివాస స్థలాలు. సనాతన సంస్కృతిని కొనసాగిస్తున్న దేవాలయాలు’ అని ఆధ్యాత్మిక గురువు ఆచార్య స్వామి గోవిందదేవ్ గిరీజీ మహారాజ్ అన్నారు. సనాతన పూజావిధానం ద్వారా దేవాలయాల్లో శక్తి ప్రజ్వరిల్లుతోందని, సనాతన హిందూ సంస్కృతిని పోషించేందుకు కారణమవుతున్నాయని చెప్పారు. ‘సమాజం, హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడేలా ఆదిశంకరాచార్యులు నాగసాధు వ్యవస్థను తీర్చిదిద్దారు. హిందూ సంస్కృతి కోసం ప్రాణత్యాగం చేసేందుకూ వారు వెనుకాడరని మహాకుంభమేళాలో స్నానాలు ఆచరిస్తున్న నాగసాధువులను చూస్తే అర్థమవుతుంది. అయోధ్యలో రామమందిరం కేవలం నిర్మాణం కాదు, హిందువుల అస్తిత్వానికి ప్రతీక. అఖంఢ భారతంలోని హిందూ దేవాలయాలను సంరక్షించుకోవాలి. తితిదే వంటి మహిమాన్విత ఆలయాలపై ప్రభుత్వాల నియంత్రణ ఉండకూడదు. పాలించే హక్కు భక్తులకే ఉండాలి. ఆలయాలకు వచ్చే సొమ్ము హిందువుల కోసమే వెచ్చించాల’ని నినదించారు.





