
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని భాషల (లాంగ్వేజ్) సంబరాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. వీటి నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ.1.86 లక్షలు కేటాయించారు. ఆయా కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడతాయని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఏఏ అంశాల్లో..
ఎంపిక చేసిన భాషలకు సంబంధించి ఆయా తేదీల్లో పఠనం, పొట్టి కథలు చెప్పడం, రాయడం, చర్చ, వక్తృత్వం, స్పెల్ చెక్, రోల్‌ప్లే, బోధనోపకరణాల తయారీ వంటి అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. సంస్కృతంలో శ్లోకాలు, ఉర్దూలో గజల్స్ చెప్పే అవకాశం కల్పిస్తారు. గిరిజన భాషలు, సంస్కృతి ప్రతిబింబించేలా సంప్రదాయ నృత్యాలు, పాటలు, ఆటలు ఉంటాయి.





