
215views
అయోధ్య రామజన్మభూమి మందిర ప్రధాన అర్చకుడు మహంత్ సత్యేంద్ర దాస్ (85) భౌతికకాయాన్ని గురువారం ‘‘జలసమాధి’’ చేశారు. ఆయన పార్థివ దేహాన్ని అనుయాయులు ఒక పల్లకీలో సరయూ నదికి తీసుకొచ్చి అక్కడి తులసీదాస్ ఘాట్ గుండా నది మధ్యకు చేర్చారు. రామానందీ శాఖ ఆచారం ప్రకారం అక్కడ జలసమాధి చేశారు. అంతకు ముందు ఆలయ తదుపరి ప్రధాన అర్చకుడు ప్రతీప్‌దాస్ మాట్లాడుతూ సత్యేంద్ర దాస్ భౌతికకాయానికి బరువైన రాళ్లు కట్టి నదిలో నిమజ్జనం చేస్తారని ప్రకటించారు. జలసమాధి చేయడానికి ముందు దేహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. మహంత్ సత్యేంద్రదాస్ బుధవారం లక్నోలోని ఒక ఆస్పత్రిలో మరణించిన సంగతి విదితమే. అయోధ్యలో 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత అక్కడ ఏర్పాటైన తాత్కాలిక ఆలయానికి ఆయన పూజారిగా వ్యవహరించారు. అనంతరం అయోధ్య నూతన రామాలయానికి ప్రధాన పూజారిగా కొనసాగారు.





