
దేశ సమైక్యత, సమగ్రతలతోపాటు మహిళా సాధికారత లక్ష్యంగా ప్రముఖ కథక్ నృత్యకారిణి సోనీ చౌరాసియా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాశీ నుంచి తిరిగి కాశీకి రోలర్ స్కేటింగ్ యాత్ర చేస్తున్నారు. సుమారు 10,550 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న ఈ యాత్ర అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణానికి చేరుకుంది. కథక్‌తో పాటు స్కేటింగ్‌లో నైపుణ్యమున్న సోనీ చౌరాసియా గతంలో కూడా ఇదే తరహాలో యాత్రలు చేశారు. ఈసారి ఏకంగా కాశీ నుంచి కాశీ వరకు సుదీర్ఘ యాత్ర చేస్తున్నట్టు ఆమె స్థానిక మీడియాకు తెలిపారు. ఆరోగ్య భారత్ రోలర్ స్కేటింగ్ యాత్ర 2.0తో చేపడుతున్న ఈ యాత్ర దేశంలో 20 రాష్ట్రాలు, 500 పట్టణాలు, నగరాలు, 10 వేల గ్రామాల మీదుగా కొనసాగుతుందన్నారు. ఈ ఏడాది జనవరి 20న కాశీలో ప్రారంభమైన తన యాత్ర వచ్చే మే 12వ తేదీకి తిరిగి కాశీకి చేరుకోవడంతో ముగుస్తుందని సోనీ చౌరాసియా తెలిపారు. మహిళలకు విద్య, రక్షణ, సమానత్వం గురించి యాత్రలో భాగంగా అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు.




