News

వాట్సాప్‌ లో… జగన్మాత దుర్గమ్మ భక్తులకు సేవలు

255views

రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను సులభతరం చేసేందుకు ప్రవేశ పెట్టిన వాట్స్‌ప్‌ నంబరు 95523 00009 ద్వారా విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆర్జిత సేవ, విరాళం, దర్శనం టిక్కెట్లు పొందేందుకు కల్పించిన అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈవో రామచంద్ర మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దేవస్థానం వెబ్‌సైట్, ఆర్జిత సేవా కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, అదనంగా వాట్సాప్‌ నంబరుతోనూ వీటిని పొందవచ్చని చెప్పారు. ఈ నంబరుకు హాయ్‌ అని మెసేజ్‌ పంపడంతో సేవను ఎంపిక చేసుకునే ఆప్షన్‌ వస్తోంది. టెంపుల్‌ బుకింగ్‌ సర్వీసెస్‌ను ఎంచుకొని విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలోని ఆలయ దర్శనం, టెంపుల్‌ సేవ, టెంపుల్‌ డొనేషన్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఉదాహరణకు అష్టోత్తర నామార్చన సేవను బుక్‌ చేసుకుంటే టైం స్లాట్‌ ఎంచుకోవాలి, కంటిన్యూ బటన్‌ నొక్కి ఎంత మంది హాజరవుతారు, ఆధార్‌ లేదా ఇతర ఐడీ వివరాలు, గోత్రం, పుట్టిన తేదీ పొందుపరిచి కంటిన్యూ నొక్కి తదుపరి వచ్చే స్క్రీన్‌పై వ్యక్తులు, పూజ, రుసుము వివరాలు సరిచూసుకొని కన్‌ఫాం నొక్కితే పేమెంట్‌ ఆప్షన్‌ వస్తోంది. ఫోన్‌ పే ద్వారా నగదు చెల్లించి వాట్సాప్‌ ద్వారా వచ్చే టిక్కెట్‌ను ప్రింట్‌ తీసుకోవాలని ఈవో తెలిపారు.