
దేశంలో పాశ్చాత్య విద్యావిధానాలను అవలంబించడంతో సామాజిక వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని.. వ్యక్తి కేంద్రీకృత పోటీతత్వం పెరిగిందని మహారాష్ట్ర లాథూర్‌లోని అర్థక్రాంతి ప్రతిష్ఠాన్ వ్యవస్థాపకులు అనిల్ బొకిల్ అన్నారు. ఇది రానురానూ మరింత సమస్యాత్మకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన సంస్కృతి లేని చదువులతో విద్య, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నాయని అన్నారు. కర్ణాటక రాష్ట్రం సేడంలో జరుగుతున్న భారతీయ సంస్కృతి ఉత్సవంలో సేవశక్తి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ కలిసి వచ్చి సమాజాన్ని సంస్కృతితో ఏకం చేయాలని సూచించారు. కులవ్యవస్థ, ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఆర్థిక వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతోందని పేర్కొన్నారు. జాతీయవాదం కంటే మానవతావాదం మరింత అవసరమన్నారు. 60 ఏళ్లు దాటిన వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలంటే ఆర్థిక, కుటుంబ, సామాజిక వ్యవస్థలను బలోపేతం చేయడం చాలా అవసరమని చెప్పారు. వ్యక్తివాద పెట్టుబడిదారీ విధానం, సోషలిస్టు వాదాల కంటే భారతదేశం ప్రబోధించే వసుధైక కుటుంబం ఆధారంగా స్థిరమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత మహేశ్ శర్మ మాట్లాడుతూ.. మనిషి చేసే చాలా పనుల్లో సేవ ఉత్తమమైనదన్నారు. కార్యక్రమంలో ఇండిమసి హీలింగ్ విలేజ్ ఛైర్మన్ యోగిశివన్, భారత్ వికాస్ సంగం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ కె.వి.నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామకథ నృత్యరూపకం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన భగత్‌సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో సైనికుల చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. 21 మంది సైనిక వీరుల ఫొటోలు ప్రదర్శించగా.. కార్గిల్ యుద్ధం, దేశ సేవలో ప్రాణాలు వదిలిన పరమ్‌వీర్‌చక్ర అవార్డు గ్రహీతలు 18 మంది ఉన్నారు. వీరి గాథలను విన్న పిల్లలు వీరులారా వందనం అంటూ సెల్యూట్ చేస్తున్నారు.
భారత్ గౌరవ్ పురస్కారాల ప్రదానం
దేశవ్యాప్తంగా వేర్వేరు రంగాల్లో చేసిన సేవకు గుర్తింపుగా 51 మందికి భారత్ గౌరవ్ పురస్కార్ ప్రదానం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన పలువురు తెలుగువారు అవార్డులు అందుకున్నారు. డాక్టర్ చంద్రశేఖర్‌రావు(వైద్యం), కండ్లగుంట శ్రీనివాస్‌రావు(సామాజిక సేవ), సూర్యచంద్రారెడ్డి(గ్రామాభివృద్ధి), ఏడుకొండలు(శిక్షణ), లీలాలక్ష్మారెడ్డి(పర్యావరణం), బసవరాజు శ్రీనివాస్(సామాజిక సేవ), సుభద్ర(నైపుణ్యాభివృద్ధి), తల్లాడ భాస్కర్(పరిశోధనలు), లెనిన్‌బాబు(విద్య), సురేష్ గుప్తా(పర్యావరణం) పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.





