
ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. 60 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పుతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈనెల 26 మహాశివరాత్రి రోజున విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు ఈసా యోగా కేంద్రంలో 112 అడుగుల ఎత్తు 82 అడుగుల వెడల్పుతో నిర్మించిన విగ్రహం భక్తుల ఆదరణ విశేషంగా పొందుతుంది. అదే రూపంలోనే ద్వారపూడిలో బిక్కవోలు మండలం కొమరి పాలెంకు చెందిన శిల్పి పెద్ద రాఘవ బృందం పదినెలలు పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. పూర్తిగా సిమెంట్ తో సుమారు రూ.20 లక్షల వ్యయంతో ఈ వి గ్రహాన్ని నిర్మించినట్లు ఆలయ గురుస్వామి ఎస్ఎల్ కనకరాజు తెలిపారు. కోనసీమ జిల్లా మండపేట మండలంకు చెందిన ఈ ద్వారపూడి రాజమహేంద్రవరం కు సుమారు 20 కిలోమీటర్లు, అనపర్తికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో సామర్లకోట కెనాల్ రోడ్ ను ఆనుకుని ఈ ఆలయం ఉంటుంది.





