News

కర్ణాటక ‘చివరి మావోయిస్టు’ లక్ష్మీ లొంగుబాటు

48views

కర్ణాటక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో చివరి మావోయిస్టుగా భావిస్తోన్న లక్ష్మీ.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉడుపి పోలీసు ఉన్నతాధికారుల ముందు సరెండరైన ఆమె.. ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

లక్ష్మీ స్వగ్రామం కుందపుర తాలుకాలోని మచ్చట్టు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అనంతరం నక్సలైట్‌ అజెండాతో పనిచేయడం ప్రారంభించింది. సమీప ప్రాంతాల్లో మావోయిస్టు సాహిత్యం ప్రచారం చేయడంతోపాటు పోలీసులపై దాడి ఘటనలతో ఆమెపై గతంలో మూడు కేసులు నమోదయ్యాయి. చాలా ఏళ్లుగా ఏపీలో తలదాచుకున్నట్లు సమాచారం. ఇటీవల లొంగిపోవాలని నిర్ణయించుకున్న లక్ష్మీ.. సరెండర్‌ కమిటీ సభ్యుడు, గతంలో లొంగిపోయిన ఆమె భర్త సలీంతో కలిసి ఉడుపి పోలీసుల ముందుకు వచ్చి సరెండర్‌ అయ్యారు.

రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సరెండర్‌ కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో లొంగిపోయే వారికి మార్గం సుగమం కావడంతో ఇటీవల అనేక మంది మావోలు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. రెండురోజుల క్రితమే శృంగేరి తాలూకా కిగ్గా గ్రామానికి చెందిన మావోయిస్టు నాయకుడు రవీంద్ర నెమ్మార్‌ చిక్కమగళూరులో అధికారుల ముందు లొంగిపోయాడు. రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు కృషి చేసిన 22 మంది పోలీసు అధికారుల బృందానికి చీఫ్‌ మినిస్టర్‌ మెడల్‌ ఇవ్వనున్నట్లు సీఎం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.