
వైయస్సార్ జిల్లా సిద్దవటం లంకమల అడవుల్లో ఆదిమానవులు గీసిన శిలా రేఖా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి సామాన్యశకానికి పూర్వం 8000-2000 మధ్య కాలం నాటివిగా తెలుస్తోంది. నేటికి చెక్కు చెదరకుండా అలాగే ఉండడం విశేషం. సిద్దవటం రేంజిలోని రోలబోడు, మద్దూరు బీటు అటవీ ప్రాంతంలోని కొండ గుహల్లో వారు నివాసం ఉన్నట్లుగా ఆనవాళ్లు లభ్యమయ్యాయి. గుహలపై గీసిన శిలా రేఖా చిత్రాలు, వినియోగించిన మట్టి పాత్రలను గతంలో అటవీ అధికారులు గుర్తించారు. ఈ చిత్రాలను వారి ద్వారా తాను సేకరించినట్లు కడపకు చెందిన తాళపత్ర గ్రంథ లిపి నిపుణుడు నాగదాసరి మునికుమార్ తెలిపారు. వాటిపై పరిశోధన చేసి ఫలితాలను నిర్ధారించామన్నారు. లంకమలలో ఆది మానవుని గుహలు, రేఖా చిత్రాలు లభ్యమవ్వడం అరుదైన విషయమని చెప్పారు. ఇక్కడి పురాతన ఆనవాళ్లపై విస్తృత పరిశోధన చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
16వ శతాబ్దం నాటి బావి గుర్తింపు
సిద్దవటంలోని లంకమల అడవిలో 16వ శతాబ్దానికి చెందిన బావి వివరాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో రేనాటి చోళులు, బాణులు, వైడుంబులు, విజయనగర రాజులు శేషాచలం కొండల్లోని తిరుమలలో కొలువైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు లంకమల అభయారణ్యం మీదుగా వెళ్లేవారని, అప్పట్లో బాటసారులు, వన్యప్రాణులు నీళ్లు తాగేందుకు రాజులు బావిని తవ్వించారని మునికుమార్ తెలిపారు. ఇది అరుదైన యోని పీఠ తటాకమని తాను చేసిన పరిశోధన ద్వారా గుర్తించానన్నారు.





