News

ఇస్రో నూరవ లాంచ్‌ విజయవంతం

261views

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఉదయం 6.23 నిమిషాలకు జిఎస్‌ఎల్‌వి-ఎఫ్15ను విజయవంతంగా లాంచ్ చేసింది. ఆ రాకెట్ తను తీసుకువెళ్ళిన ఎన్‌విఎస్-02 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో సురక్షితంగా చేర్చింది. ఇది శ్రీహరికోట నుంచి ఇస్రో చేసిన వందవ లాంచ్.

జిఎస్‌ఎల్‌వి-ఎఫ్15 అనేది భారతదేశపు జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ శ్రేణిలో 17వ ఫ్లైట్. దేశీయంగా తయారు చేసిన క్రయో స్టేజ్ కలిగిన 11వ ఫ్లైట్. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్‌తో ప్రయోగానికి ఉపయోగించిన 8వ ఫ్లైట్. జిఎస్ఎల్‌వి-ఎఫ్15 పేలోడ్ ఫెయిరింగ్ 3.4 మీటర్ల వ్యాసం కలిగిన, లోహంతో తయారు చేసిన ఫెయిరింగ్ కావడం విశేషం.

ఇస్రో తమ నూరవ లాంచ్‌ను చూడడానికి నేరుగా లాంచ్‌ప్యాడ్ దగ్గరకు విద్యార్ధులకు అవకాశం కల్పించింది. ఈ ప్రయోగాన్ని చూసిన విద్యార్ధుల ఆనందం అవధులు దాటింది.

‘‘ఈ ప్రయోగం ద్వారా ఎన్‌విఎస్-02 ఉపగ్రహాన్ని భూమికి 36వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జియోస్టేషనరీ కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. ఎన్‌విఎస్-02 ఒక నావిగేషన్ శాటిలైట్. దాని ప్రయోగంతో భారతదేశపు రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌లో ఉపగ్రహాల సంఖ్య 4 నుంచి 5కు పెరిగింది. ఈ నావిగేషన్‌ శాటిలైట్‌ వల్ల పొజిషనింగ్‌లో కచ్చితత్వం మరింత పెరుగుతుంది’’ అని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ వెల్లడించారు.

భారతదేశపు ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్)లో మొత్తం 7 ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉండాలి. తాజా వందవ లాంచ్ ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి పంపించిన ఉపగ్రహం ఐదవది. ఇంకో రెండు ఉపగ్రహాలను కూడా ప్రయోగిస్తే ఐఆర్ఎన్ఎస్ఎస్‌ వ్యవస్థ పూర్తవుతుంది. తద్వారా నావిగేషన్ సిస్టమ్ మెరుగవుతుంది. ఆ క్రమంలో పాత శాటిలైట్‌ల స్థానంలో కొత్త ఉపగ్రహాల శ్రేణిని ప్రవేశపెడుతోంది ఇస్రో.