
( జనవరి 29 – పుష్య అమావాస్య / మౌని అమావాస్య )
హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ప్రాధాన్యత ఉంది. ఆ రోజున విష్ణుమూర్తి, సూర్యభగవానులను పూజిస్తారు. ముఖ్యంగా పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య మరింత ప్రత్యేకమైంది. ఈ రోజున రాగిగిన్నెలో స్వచ్ఛమైన నీరు, ఎర్ర చందనం, ఎర్రటి పూలు వేసి.. ఆ నీటిని సూర్యుడికి సమర్పించాలి. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉపవాసం ఉండి దానధర్మాలు చేయాలి. తులసి మొక్కను పూజించి, తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల పితృ దేవతల దోషాలేమైనా ఉంటే తొలగిపోతాయి. పురాణ కథనం ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి అమృతంగా మారి ఆకాశం నుంచి కిందికి దిగివస్తుంది. ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే పరమపుణ్యమని, అలా అవకాశం లేకుంటే మరే నదిలోనైనా స్నానం చేయాలన్నది పెద్దల మాట. పుష్య అమావాస్య రోజున చేసే సత్కార్యాలకు గొప్ప ఫలితాలు లభిస్తాయి. ఈ అమావాస్యను లఘు పితృపక్షంగా పరిగణిస్తారు.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా జరుగుతుంది. జనవరి 29 మౌని అమావాస్య పుణ్య తిథి. మౌని అమావాస్య నాడు పుణ్య నదుల్లో స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి.మౌని అమావాస్య రోజున జరిగే మహా కుంభమేళా అమృత స్నానం సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో భక్తులు ఇబ్బంది పడకుండా స్నానమాచరించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మౌని అమావాస్య రోజున కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో జనసమూహం , ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
హిందూ మతంలో పితృ దేవతలను స్మరించుకుని.. వారికి తర్పణాలు ఇచ్చేందుకు చాలా పవిత్రంగా భావిస్తారు. పుణ్య నదుల్లో కాని .. కుంభమేళా జరిగే ప్రదేశంలో కాని.. గయ లో కాని పిండ ప్రదానం చేస్తే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కుభమేళా ప్రయాగ్ రాజ్ లో జరుగుతుంది. ఆరోజున (జనవరి 29) దాదాపు 10 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానం ఆచరించేందుకు ప్రయాగ్ రాజ్ కు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ రోజున పుణ్యనదుల్లో చేసే స్నానాన్ని అమృత స్నానం అంటారు.





