ArticlesNews

తిరుమలలో వైభవంగా రథసప్తమి

456views

తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి ) ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులతో ఈవో సమీక్షించారు. భక్తులు గ్యాలరీల్లోకి ప్రవేశించే, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అనంతరం.. అదనపు ఈవో వెంకయ్యచౌదరి, అధికారులతో కలిసి తిరుమల మాడవీధుల్లో ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ‘‘శ్రీవారి ఉత్సవాల్లో రథసప్తమి అత్యంత ముఖ్యమైనది. ఏటా శుక్లపక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమిని వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకకు సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. వేడుకల్లో భాగంగా స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఫిబ్రవరి 4న ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనసేవతో శ్రీమలయప్పస్వామివారి వాహన సేవలు ముగుస్తాయి’’ అని ఈవో తెలిపారు.

భక్తులకు టిటిడి సూచనలు…

  • రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు
  • అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు
  • ఎన్‌ఆర్‌ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు
  • తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదు
  • ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
  • బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదు
  • ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 దర్శనం) టోకెన్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్టు చేయాలి
  • శ్రీవారి వాహనసేవల వివరాలు..

    ఉదయం 5.30 గం నుంచి 8 గం వరకు – సూర్యప్రభ వాహన సేవ
    ఉదయం 9 గం నుంచి 10 గం వరకు – చిన్నశేష వాహన సేవ
    ఉదయం 11 గం నుంచి 12 గం వరకు – గరుడ వాహన సేవ
    మధ్యాహ్నం 1 గం నుంచి 2 గం వరకు – హనుమంత వాహన సేవ
    మధ్యాహ్నం 2 గం నుంచి 3 గం వరకు – చక్రస్నానం
    సాయంత్రం 4 గం ల నుంచి 5 గం వరకు – కల్పవృక్ష వాహన సేవ
    సాయంత్రం 6 గం ల నుంచి 7 గం వరకు – సర్వభూపాల వాహన సేవ
    రాత్రి 8 గం నుంచి 9 గం వరకు – చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.