News

27న ‘సనాతన్‌ బోర్డు’ ప్రకటిస్తాం

404views

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాలో పాలుపంచుకొంటున్న వివిధ అఖాడాలు (సాధువుల కూటములు) ఈ నెల 27న ‘సనాతన్‌ బోర్డు’ రాజ్యాంగ ముసాయిదా విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించాయి. సనాతన ధర్మాన్ని ప్రభుత్వ ‘నియంత్రణ’ నుంచి బయటకు తీసుకురావడమే దీని ఉద్దేశమని వెల్లడించాయి. మేళాలోని నిరంజని అఖాడాలో పలువురు సాధువులు సమావేశమై మీడియాతో మాట్లాడారు. సనాతన బోర్డు విధి విధానాలను ప్రముఖ ఆధ్యాత్మిక వక్త దేవకీనందన్‌ ఠాకుర్‌ వివరించారు. మహాకుంభ్‌ నగర్‌లోని సెక్టార్‌ 17లో నిర్వహించనున్న ‘ధర్మ సభ’ను మతస్వేచ్ఛా దినోత్సవంగా జరుపుకొంటామని, సనాతన్‌ బోర్డు రాజ్యాంగ ముసాయిదాను అదే రోజు ప్రకటిస్తామన్నారు. ఈ ముసాయిదా తుది మెరుగుల్లో ఉందని, ఆధ్యాత్మిక నాయకులు అందరి సమక్షంలో వెల్లడిస్తామని అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ రవీంద్రపురి తెలిపారు. ‘‘మన ధర్మానికి (మతానికి) స్వేచ్ఛ లేదు. ఆలయాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. సంప్రదాయ గురుకులాలు మూతపడ్డాయి. గోమాతలు వీధుల్లో తిరుగుతున్నాయి. మా ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లాలంటే సనాతన్‌ బోర్డు అవసరం’’ అన్నారు.