
ఏలూరు జిల్లాలోని తణుకు మండలం తేతలిలోని లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు గేదెలు తీసుకువెళ్తున్న రెండు వ్యాన్‌లను గోసేవా సమితి సభ్యులు అడ్డుకున్నారు. అనుమతులు లేని పశువధ శాలకు అక్రమమార్గంలో రెండు వ్యాన్‌లలో తరలిస్తున్న గేదెలను నిలుపుదలచేసి రూరల్ పోలీసులకు అప్పగించారు. పశువధ శాలకు కొద్దిదూరంలో అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇవ్వగా రూరల్ ఎస్సై చంద్రశేఖర్ రెండు వ్యాన్‌లను రవాణా కార్యాలయానికి తరలించారు. మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసు వ్యాన్‌ల రికార్డులు పరిశీలించి ఒక వ్యాన్‌లో ఒక గేదెను మాత్రమే తరలించాలని, ఒక దానిలో 6, మరో వ్యాన్‌లో 4 గేదెలు తరలిస్తున్న వ్యాన్‌లను సీజ్‌చేసి రూరల్ పోలీసులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. రెండు వ్యాన్‌లపై జరిమానా వేసి గేదెలను రోడ్డుపై వదిలేశారని గోసేవా సమితి సభ్యుడు శ్రీనివాస్ ఆరోపించారు. అధికారుల తీరు లాహం సంస్థకు అనుకూలంగానే ఉందని విమర్శించారు.





