
ఈరోజున యావత్ భారత దేశంలో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా కార్మిక, కర్షక వర్గాలలో ఎంతో ఆదరంతో ప్రముఖంగా చెప్పుకునే పేరు శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే. స్వాతంత్య్రానంతరం భారతదేశం తన ఆర్థిక స్వావలంబన కోసం పారిశ్రామి కీకరణ మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నది. అదే సమయంలో 50, 60 దశకాలలో దేశంలో కార్మిక సంఘాలు, శ్రామిక రాజకీయాలు అనే రెండు కొత్త విషయాలు కూడా అందరికీ పరిచయం అయ్యాయి. ఈ రెండు విషయాల మధ్య ఉన్న ఒక సున్నితమైన కోణాన్ని, వ్యత్యాసాన్ని భారతదేశంలో మొట్ట మొదటగా శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే గుర్తించారు. శ్రామికుల కోసం ఆయన తన జీవన శైలిని మార్చుకున్నారు. ఈ ప్రయాణంలో కార్మికులతో మాట్లాడుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, వాటిని పరిష్కరిస్తూ, కార్మిక ఐక్యతా సంఘాలను ఏర్పాటు చేస్తూ ఎంతో ఆత్మానందాన్ని పొందటమే కాక, ఎదుటివారిని కూడా ప్రభావితం చేస్తూ, వారు ఎంతటి సమూహం, వ్యక్తి అయినా, వారి నుండి, తాను కోరుకున్న విధానంలో అనుకూలమైన పరిష్కారాలను పొందగలిగే వారు.
భారత దేశంలో కార్మిక సంఘాల కోసం ప్రయత్నాలు ప్రారంభం చేసిన శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే మహారాష్ట్రలోని ఆర్వి అనే పట్టణంలో జన్మించారు. పదిహేనేళ్ల వయసులోనే అక్కడి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవీ కాలంలో తన సమర్థతను, సేవా భావాన్ని పరిచయం చేస్తూ పాఠశాలలోని పేద విద్యార్థుల కోసం ఉపకార వేతనాన్ని అందించే ఏర్పాటు చేశారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క సిద్ధాంతాల నుండి నిరంతరం స్ఫూర్తిని పొందే శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే 1942 నుండి 1945 వరకు కేరళ ప్రాంతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత ప్రచారక్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 1945 నుండి 1948 వరకు బెంగాల్ ప్రాంత ప్రచారక్ గా పనిచేశారు. 1949లో శ్రీగురూజీ వీరిని, కార్మిక క్షేత్రంలో కార్మిక సంఘాల స్థాపన, నాయకత్వ బాధ్యతలను నిర్వహించవలసిందిగా ఆదేశించారు. ఈ సంఘటన తర్వాత శ్రీ దత్తోపంత్ జీవితం పూర్తిగా కర్షక కార్మిక వర్గాల వారి కోసమే అంకితమైపోయింది.
1950లో శ్రీ దత్తోపంత్ గారిని INTUC యొక్క కేంద్ర బృందంలో సభ్యుడిగా నియమించారు. ఆ తర్వాత మధ్య భారతంలో ఈ సంస్థకు సంస్థాగత సభ్యుడిగా పని చేశారు. తర్వాత 1952 నుండి 1955 మధ్యలో కమ్యూనిస్టు ప్రభావిత ప్రాంత మైన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కు ప్రాంతీయ సంస్థాగత సభ్యుడిగా పని చేశారు. పోస్టల్, జీవిత భీమా, రైల్వే, ఖాదీ ఉద్యోగం, బొగ్గు పరిశ్రమ వంటి ఎన్నో సంస్థలకు సంబంధించిన కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా పని చేశారు.
అత్యంత మేధావి, సునిశిత బుద్ధిశీలి అయిన శ్రీ దత్తోపంత్ గారు తన జీవిత కాలంలో 26 హిందీ, 12 ఇంగ్లీష్, 2 మరాఠీ పుస్తకాలు రాశారు. వీటిలో ‘రాష్ట్ర ‘ అనే పుస్తకం , ‘ధ్యేయపథంలో కర్షకుడు’ అనే పుస్తకాలు శ్రామిక వర్గంవారికి, కార్యకర్తలకు వారి వారి రంగాలలో సరైన దారిని చూపిస్తాయి.
శ్రీ దత్తోపంత్ గారి జీవితాన్ని పరిశీలిస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క విశాల ప్రపంచంలో ఒక నక్షత్రం గా వెలుగొందిన ఆయన ఆ సంస్థలోని ఎన్నో ఇతర అనుబంధ సంస్థలకు కూడా తన విజ్ఞానాన్ని, అభిమానాన్ని పంచారు. 1955 నుండి 1959 వరకు మధ్య ప్రదేశ్ , దక్షిణ భారతదేశంలో జనసంఘ్ ను స్థాపించి విస్తృత పరచే బృహత్తర బాధ్యతను ఆయన నెరవేర్చారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ లో సంస్థాపక సభ్యుడిగా, భారతీయ బౌద్ధ మహాసభలో సభ్యుడిగా పని చేశారు. 1955లో పర్యావరణ వేదికను, తరువాత సర్వధర్మ సమాదరణ వేదికను స్థాపించారు. ఈ పనులన్నింటినీ చేస్తూ శ్రీ దత్తోపంత్ గారు 1955 నాటికి భారతీయ మజ్దూర్ సంఘ్ స్థాపన అనే మహా యజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ రోజున భారతీయ మజ్దూర్ సంఘ్ 60 లక్షలకు పైగా సభ్యులతో ఒక విరాట్ సంస్థగా వెలుగొందుతోంది.
1967లో ఆయన ఇండియన్ లేబర్ ఎక్స్ప్లోరేషన్ సెంటర్ ను, స్వదేశీ జాగరణ మంచ్ ను స్థాపించి కృషి చేశారు. భారత పార్లమెంట్ లో రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ వాదనలను వివిధ వేదికలపై వినిపించారు. అనేక దేశాలలో పర్యటించి అక్కడి సామాజిక స్థితిగతులను అధ్యయనం చేశారు ప్రపంచంలోని అన్ని దేశాలలోని శ్రామికుల స్థితిగతులపై అధ్యయనం చేశారు. అనేక దేశాలతోనూ, దేశాలలోని కార్మిక సంస్థలతోను చక్కని సంబంధాలు కలిగి ఉండి వారిపై తనదైన ముద్ర వేశారు. చైనాలో ఆయన పర్యటన సందర్భంగా ఆయన ఉపన్యాసాన్ని అక్కడి జాతీయ రేడియో ప్రసారం చేసింది. నిషేధాజ్ఞలు ఎక్కువగా పాటించే చైనాలో ఈ ఉపన్యాసం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అటువంటి ఆ మహానుభావుని దేశమంతటా, విశ్వవ్యాప్తంగా కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల వారందరూ నేడు గుర్తుచేసుకుని ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
హిందీ మూలం : శ్రీ నారద మీడియా సెంట్రల్ డెస్క్.
తెలుగు అనువాతం : పులిగడ్డ రాధాదేవి.





