News

గోరక్ష మహా పాదయాత్ర

215views

గోసంతతి లేకుంటే మానవ మనుగడే లేదని, గోసంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ బాలకృష్ణ గురుస్వామి చేపట్టిన గోరక్ష మహా పాదయాత్ర 112వ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరింది. మహాపాదయాత్ర చేపట్టిన బాలకృష గురు స్వామికి మల్లాది విష్ణు మద్దతు తెలిపారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ గోమాత సకల దేవతా స్వరూపమని చెప్పారు. గోవు విశిష్టత గురించి దేశవ్యాప్తంగా చాటిచెబుతూ బాలకృష్ణ గురుస్వామి పాదయాత్రలో చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. గోవుకు ఇరుముడి కట్టి శబరిమలైకు తీసుకువెళ్లడం చరిత్రలోనే ప్రప్రథమమన్నారు. మానవజాతి మనుగడకు అనాదిగా గోమాత చేస్తున్న సేవ వెలకట్టలేనిదన్నారు. దేశానికి రైతు వెన్నుముక అయితే, ఆ రైతుకు వెన్నుముక గోమాత అని అన్నారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి నేటి వరకు గోవు లేని సమాజాన్ని ఊహించలేనిదన్నారు. గోమాతను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ, గత ఏడాది సెప్టెంబర్‌ 27న కాశ్మీర్‌లో పాదయాత్ర ప్రారంభమైందని, ఇప్పటి వరకు 14 రాష్ట్రాల్లో కొనసాగిందని, 180 రోజుల్లో 4,900 కిలోమీటర్లు నడిచి మార్చి 27న కన్యాకుమారిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తన యాత్రలో భాగంగా పుంగనూరు ఆవుకు హైదరాబాద్‌లో అయ్యప్ప ఇరుముడి కట్టి తనతో పాటు యాత్రలో తీసుకెళుతున్నానని వెల్లడించారు. గోసంతతిని రక్షించాలని కోరుతూ అయ్యప్ప స్వామికి వినతి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన గోసంరక్షణ సమితి ప్రతినిధులు హాజరయ్యారు.