News

కాశినాయన క్షేత్రానికి మహర్దశ

226views

ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతున్న జ్యోతిక్షేత్రానికి త్వరలో మహర్దశ పట్టనుంది. ఆటంకంగా ఉన్న అటవీశాఖ అనుమతులు తొలగిపోనున్నాయి. కాశినాయన క్షేత్రానికి అవసరమైన మూడు హెక్టార్ల స్థలాన్ని కేటాయించడానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. భాకరాపేట- బద్వేలు రహదారి విస్తరణకు మార్గం సుగమమవుతోంది. కలివికోడి పేరిట రాత్రి పూట రాకపోకలను నిలిపి వేస్తుండగా..పరిష్కార మార్గానికి చొరవ తీసుకుంటున్నారు.

కాశినాయన వందేళ్లు జీవించి తన ఇష్టదైవమైన జ్యోతి నరసింహస్వామి పాదాల చెంత 1995 డిసెంబరు 5న జీవ సమాధి అయ్యారు. కాశినాయన సమాధిపై అద్భుతమైన దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణాలను అటవీశాఖ అడ్డుకుంది. దీంతో ఆయా నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. వైకాపా హయాంలో అటవీ అనుమతులు సాధిస్తామంటూ నేతలు గొప్పలు చెప్పినా ఆ మేరకు కార్యం నెరవేరలేదు. తాజాగా బద్వేలు నియోజకవర్గ తెదేపా నేత రితీష్‌రెడ్డి.. మంత్రి సత్యకుమార్‌ ద్వారా కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిశారు. క్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరించడంతో పాటు ఐదు జిల్లాల భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తున్నట్లు ప్రాధాన్యతను వివరించారు. క్షేత్రంలో మందిరం నిర్మాణానికి మూడు హెక్టార్ల భూమిని కేటాయించాలని విన్నవించారు. ఇంతకంటే ఎక్కువ కోరిన పక్షంలో అనుమతుల సాధనకు కష్టంగా ఉంటుందని… క్లుప్తంగానే కోరారు. దీనికి కేంద్ర మంత్రి అంగీకరిస్తూ త్వరలోనే అనుమతులిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాతి స్తంభాలతో చేపట్టిన మందిర నిర్మాణం పనులు పునః ప్రారంభమవుతాయని భక్తులు ఆశిస్తున్నారు.

భాకరాపేట- బేస్తవారిపేట రహదారికి మోక్షం

సిద్దవటం మండలం భాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బేస్తవారిపేట వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉంది. ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ రాష్ట్ర మంత్రులు, జిల్లా నేతలకు హామీ ఇచ్చారు. నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో పాటు రాత్రి పూట అనుమతులకు వీలుగా ఆకృతులు రూపొందించడానికి కేంద్ర మంత్రి చొరవ తీసుకుంటున్నారు. కలివికోడి పేరిట రాత్రి పూట వాహనాల రాకపోకలు ఆపేస్తున్నారని కేంద్ర మంత్రి వద్ద తెదేపా నేత రితీష్‌రెడ్డి ప్రస్తావించగా ఆయన స్పందించారు. రహదారి విస్తరణతో పాటు వన్యప్రాణులకు హాని కలగకుండా అవి రాకపోకలు సాగించే ప్రాంతాల్లో భూగర్భ రహదారిని నిర్మించేలా ఆకృతులు రూపొందిస్తామని మంత్రి తెలిపారు. అవసరమైన ప్రాంతంలో రహదారి వెంట ఇనుప ముళ్ల కంచె నిర్మాణం చేపడతామని, ఈ మేరకు అటవీ అనుమతులు సాధిస్తామని స్పష్టం చేశారు. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రహదారి విస్తరణ, రాత్రిపూట రాకపోకలకు సౌలభ్యం కలగనుంది. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి, ఇతరత్రా జాతీయ రహదారుల జంక్షన్‌గా ఉన్న బద్వేలుకు అవుటర్‌ రింగ్‌ రోడ్డు కేంద్ర నిధులతో చేపట్టడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ కొలిక్కి వస్తే బద్వేలుతో పాటు కాశినాయన క్షేత్రానికి మహర్దశ పట్టనుంది.