News

అంతరిక్షంలో అద్భుతం: చరిత్ర సృష్టించిన భారత్

263views

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది. అంతిరక్షంపై జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ మిషన్ విజయవంతమైంది. ఇస్రో చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది.

స్పేస్ డాకింగ్‌లో భాగమైన రెండు ఉపగ్రహాలు ఇప్పుడు ఒకే కక్ష్యలో చేరాయి. ఈ రెండూ స్పేస్ డాకింగ్ పూర్తి చేసుకున్నాయి. ఫలితంగా భారత్ కొత్త చరిత్రను సృష్టించింది. అమెరికా, రష్యా, చైనా సరసన నిలిచింది. భారత్ కంటే ముందు స్పేస్ డాకింగ్‌ను సక్సెస్ చేసిన దేశాలు ఈ మూడే.

స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్‌ను కిందటి నెల 30వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా 220 కేజీల బరువున్న రెండు చిన్న ఉపగ్రహాలను తిరుపతి జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. దీనికోసం ప్రతిష్ఠాత్మక పీఎస్ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ఉపయోగించింది.

ఉపరితలం నుంచి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో ఈ రెండు శాటిలైట్లు ప్రవేశించాయి. ఈ నెల 10వ తేదీన ఎస్‌డీఎక్స్ 01 ఛేజర్ శాటిలైట్.. ఎస్‌డీఎక్స్ 02 టార్గెట్‌ను సమీపించింది. మొదట్లో ఈ రెండు శాటిలైట్ల మధ్య దూరం 230 మీటర్లు. ఆ తరువాత ఈ నెల 12వ తేదీన మరింత చేరువ అయ్యాయి. ఒకే రోజున రెండు మూడు గంటల వ్యవధిలో తొలుత 15, ఆ తరువాత మూడు మీటర్ల దూరానికి వచ్చాయి.

ఇప్పుడు తాజాగా ఈ రెండూ డాక్ అయ్యాయి. ఎస్‌డీఎక్స్ 01 ఛేజర్ శాటిలైట్.. ఎస్‌డీఎక్స్ 02 టార్గెట్‌తో డాకింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ధీటుగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని ఇస్రో సంకల్పించిన నేపథ్యంలో ఈ స్పేస్ డాకింగ్ విజయవంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భవిష్యత్‌లో చేపట్టబోయే అనేక స్పేస్ మిషన్లల్లో విప్లవాత్మక మార్పులకు ఇది శ్రీకారం చుట్టినట్టవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. స్పేస్ డాకింగ్ విజయవంతం కావడం పట్ల కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. అంతరిక్షంలో మరో చారిత్రక ఘట్టానికి ఇస్రో శ్రీకారం చుట్టిందని పేర్కొంది.

ఈ మేరకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినిందించారు. స్పేడెక్స్ విజయవంతం కావడాన్ని నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. భారతీయ డాకింగ్ వ్యవస్థ శక్తి సామర్థ్యాలకు ఇది అద్దం పట్టిందని పేర్కొన్నారు.

భవిష్యత్తుల్లో చేపట్టబోయే భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం, చంద్రయాన్ 4, గగన్‌యాన్ వంటి భారీ స్పేస్ మిషన్లను విజయవంతం చేయడానికి ఈ డాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనికి బాటలు వేసిందని జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ మరిన్ని అంతరిక్ష ప్రయోగాలను సక్సెస్ చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.