ArticlesNews

సంక్రాంతి పెద్ద పండుగ ఎందుకు అయ్యింది?

411views

సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి? మూడు రోజుల పండుగను ఎలా జరుపుకుంటారు..!

నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు. కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు. అదే సంక్రాంతి పండుగ. ఈ పండుగను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటి. ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి పండుగను పెద్ద పండుగగ ఎలా జరుపుకుంటున్నారో..పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దక్షిణదిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తరదిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. సంక్రాంతి సౌరమానం ప్రకారం చేసుకుంటారు. కాబట్టి ఈ పండుగ తేదీల్లో మార్పులు ఉండటం చాలా అరుదు.

సంక్రాంతి పెద్ద పండుగ ఎందుకు అయ్యింది?
సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు. అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్లు కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు. పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ అన్నీ చేసి నైవేద్యం సమర్పిస్తారు. అంతేకాదు ప్రక్రుతిని పూజించడంతోపాటు పశువులను కూడా పూజిస్తుంటారు.