
( జనవరి 14 – సంక్రాంతి )
సం-క్రాంతి’ అనే పదంలో ‘సం’ అంటే ‘శుభం’ అని, ‘క్రాంతి’ అంటే ‘పరివర్తన’ లేదా ‘విప్లవం’ అని అర్థం. ‘సంక్రాంతి’ అంటే శుభకరమైన పరివర్తన తెచ్చే రోజు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని ‘మకర సంక్రమణం’ అంటాం. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అప్పటివరకూ దక్షిణ దిక్కున ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని… ఉత్తర దిక్కులో సంచారం మొదలుపెడతాడు. సూర్యుడి గమనం మారడం వల్ల… వాతావరణంలో మార్పులు వస్తాయి.
సమస్త సృష్టికి ఆధారభూతుడు సూర్య భగవానుడు. ఆయన అనుగ్రహం లేకపోతే మానవాళికి మనుగడ లేదు. తను నిరంతరం మండుతూ సమస్త విశ్వానికి మేలు చేకూరుస్తాడు. ఇతరులకు ఆనందం కలిగిస్తాడు. ఈ గుణాలు మనలో పెంపొందించుకుంటే అహంకారానికి తావుండదు. రాత్రి చీకటి వల్ల మనం నిద్రావస్థలో ఉంటాం. సూర్యుడు ఉదయించాక… ఆయన ప్రకాశం వల్లనే పనులన్నీ జరుగుతాయి. కాబట్టి అన్ని కార్యాలను ప్రభావితం చేసేది సూర్యుడే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… మిగిలిన పండుగలన్నీ చంద్రుని గమనం ఆధారంగా జరుపుకొంటే… సంక్రాంతిని సూర్య గమనాన్ని పరిగణనలోకి తీసుకొని జరుపుకొంటాం. అందుకే ఇది చాలా ముఖ్యమైన రోజు.
పెద్ద పండుగ
సంక్రాంతి పండుగ సమయానికి ధాన్యం పొలాల నుంచి ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో పొంగిపోతారు. కొత్త బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అలాగే అరిసెలు, చక్కిలాలు లాంటివి తయారు చేస్తారు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేస్తారు, అందుకే ఈ పండుగను అక్కడ ‘పొంగల్’ అని పిలుస్తారు. పంటను ప్రసాదించిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ… తాము తయారు చేసిన వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పండగ సందర్భంగా ప్రకృతిని, పశువులను కూడా పూజిస్తారు. మొదటి రోజున భోగీ, రెండో రోజు మకర సంక్రాంతి మూడో రోజు కనుమ… మొత్తంగా ఇది ప్రధానమైన పండుగ. పల్లెల్లో దీన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ధాన్య లక్ష్మికి స్వాగతం చెప్పడానికి ఇంటి గుమ్మాలను మామిడి కొమ్మలతో, పూల దండలతో, వాకిళ్ళను రంగవల్లులతో, వాటిలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలతో అంలకరిస్తారు. సంక్రాంతి జానపద కళా సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, రంగవల్లుల పోటీలు తదితరాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. మూడో రోజు కనుమ రైతులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉంటూ ధాన్య రాశులను ఇంటికి తీసుకురావడానికి సహాయం చేసిన పశువులకు కృతజ్ఞతతో పూజలు జరుపుతారు.





