
నియంత్రణ రేఖ వెంబడి భారీ అలజడికి పాక్ పన్నాగం పన్నినట్లు కీలక సమాచారం అందడంతో, పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఐరాసలో పాక్ సాధారణ సమావేశం తర్వాత నిఘా వర్గాలకు ఈ మేరకు సమాచారం అందింది.
పాక్‌సైన్యం, జమాత్ ఉల్ అల్ హదీప్ సంస్థ సంయుక్తంగా 4 వేల మంది యువకులకు శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర నిఘా బృందం గుర్తించింది. అంతేకాకుండా మరికొందరికి రావల్పిండిలోనూ 4 వారాలపాటు శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పీవోకేలోని పౌరుల మద్దతుతో అలజడికి సిద్ధమైనట్లు భారత నిఘావర్గాలకు కీలక సమాచారం అందింది. శిక్షణ పొందిన వారు నియంత్రణ రేఖదాటి భారత్‌లో చొరబాటుకు ప్రయత్నించే అవకాశముందని నిఘావర్గాలు భావిస్తున్నాయి. పీవోకేలో జేకేఎల్‌ఎఫ్ ఆజాదీ సంస్థకు చెందిన వారు పాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నియంత్రణ రేఖ వద్ద ఇమ్రాన్‌ఖాన్ ఈ వారంలో పర్యటించనున్నట్లు సమాచారం. అయితే పాక్ ఎలాంటి దాడులకు పాల్పడినా వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి.
Source : Enadu.




