News

భారత సముద్ర తీరం.. 11వేల కి.మీ.

235views

భారత సముద్ర తీరం పొడవు 48% పెరిగింది. ఇండియన్‌ నావల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీస్, సర్వే ఆఫ్‌ ఇండియా 1970 డేటా ప్రకారం దేశంలోని 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్రతీరం పొడవు 7,516 కిలోమీటర్ల మేర ఉండగా, తాజాగా నేషనల్‌ మారిటైం సెక్యూరిటీ కో-ఆర్డినేటర్‌ నిర్దేశించిన విధివిధానాల ప్రకారం నిర్వహించిన రీ-వెరిఫికేషన్‌లో ఈ పొడవు 11,098.81 కిలోమీటర్లుగా లెక్కతేలింది. గతంలో నేరుగా ఉన్న దూరాన్నే తీసుకోగా.. రీవెరిఫికేషన్‌లో మలుపులు, వంపులను కూడా లెక్కించడంతో ఈ మొత్తం ఉన్నట్లు తేలింది.

సోమవారం రాత్రి విడుదలైన కేంద్ర హోంశాఖ 2023-24 వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంత పొడవు 973.70 కిలోమీటర్ల నుంచి 1,053.07 కిలోమీటర్లకు (8.15%) పెరిగింది. తమిళనాడు తీరం పొడవు 906.90 కి.మీ. నుంచి 1,068.69 కి.మీ.కి చేరింది. సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న రాష్ట్రాల జాబితాలో ఇప్పటివరకు దేశంలో రెండోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఈ లెక్కల ప్రకారం మూడోస్థానానికి పడిపోనుంది. ఇప్పటివరకు భారత ప్రధాన భూభాగం సరిహద్దు పొడవునా, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూమహాసముద్రం, పశ్చిమాన అరేబియాల్లో ఉన్న ద్వీపాలన్నింటిలో కలిపి భారత తీరప్రాంతం 7,516.6 కిలోమీటర్లు ఉన్నట్లు నిర్ణయించారు. అయితే తీరప్రాంతాన్ని కొలవడానికి నేషనల్‌ మారిటైం సెక్యూరిటీ కో-ఆర్డినేటర్‌ ఖరారుచేసిన నూతన విధివిధానాలను అనుసరించి చేసిన రీ-వెరిఫికేషన్‌లో భారత తీరప్రాంతం పొడవు 11,098.81 కిలోమీటర్లుగా తేలినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇందులో గుజరాత్‌ తీరం అత్యధికంగా 92.69%, అండమాన్‌ నికోబార్‌ దీవుల తీరం 57.16% మేర పెరిగింది.

ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతానికి 15 పోలీసు స్టేషన్లు మంజూరుచేయగా అన్నీ ప్రారంభమయ్యాయి. జెట్టీలు ఏడు కేటాయించగా ఒక్కటీ నిర్మాణం జరగలేదు.