News

ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దు.. తాలిబన్ల కొత్త రూల్‌

229views

అఫ్గానిస్థాన్‌ను చేజిక్కించుకున్న తాలిబన్లు.. అక్కడి మహిళల హక్కులను కాలరాస్తున్నారు. తాజాగా ఆ దేశ పాలకులు తీసుకువచ్చిన డిక్రీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నూతనంగా నిర్మించే ఇళ్లల్లో మహిళలు బయటివారికి కనిపించేలా వంట గదికి కిటికీలు ఏర్పాటుచేయొద్దని ఆదేశాలు ఇవ్వడం నివ్వెరపరుస్తోంది.

‘‘వంట గదులు, ఇంటి ఆవరణ, నీటికోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయటివారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీసే వీలుంది. వారు కనిపించకుండా గోడలు కట్టాలి. ఇప్పటికే స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని మూసివేయాలి’’ అని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈనేపథ్యంలో మున్సిపల్ అధికారులు కొత్త నిర్మాణాలను పరిశీలించి, ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించనున్నారు.

మతపరమైన ఆచారాల ముసుగులో మహిళల హక్కులు, స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్న తాలిబన్‌ ప్రభుత్వం.. ఇప్పటికే జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం అమలుచేస్తోంది. మిడిల్‌ స్కూల్‌, హైస్కూల్‌ విద్యకు బాలికల్ని దూరం చేయడం.. పలు రంగాల్లో మహిళల ఉద్యోగాలను పరిమితం చేయడం, ఆటలాడటంపై నిషేధం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తల నుంచి కాలి వరకు దుస్తులు ధరించాలని ఆదేశించడం వంటి అనేక కఠిన ఆంక్షలు విధించారు. తాలిబన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గతంలో ఐరాస ఖండించింది. జనజీవన స్రవంతి నుంచి మహిళల్ని క్రమపద్ధతిలో దూరం చేసే ఇలాంటి చర్యలు సరికాదని ఆందోళన వ్యక్తంచేసింది.