
పాలిచ్చే పాడి పశువులకు కొందరు కర్కశకులు పాడె కడుతున్నారు. బహిరంగంగానే పశువులను తరలించి వధించి మాంసం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గోవులను మాత్రం రాత్రి సమయాల్లో ఎవరికంటా కనబడకుండా తీసుకు వచ్చి వధిస్తున్నారు. ఇదంతా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో స్థాపించిన కర్మాగారంలో నిత్యం జరుగుతున్న వధ, వాయు కాలుష్యం, దుర్ఘంధంతో అవస్థలు పడుతున్నామంటూ స్థానికులు సైతం రోడ్డెక్కారు. గోవులను, పశువులను వధించడం నిలిపివేయాలని, కర్మాగారం తక్షణం మూసివేయాలని డిమాండ్ చేస్తూ గో సేవా సమితి సభ్యులు ఇప్పటికే ఆందోళన కొనసాగిస్తున్నారు. తణుకు ప్రాంతం నుంచి ఈ ఫ్యాక్టరీ తొలగించాలని పశువధ శాల పరిసర నిర్వాసితులతో పాటు గో సేవా సమితి సభ్యులు, ఎఫ్ సీఐ గొడౌన్స్ హమాలీలు తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

పాడి గేదెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
సాధారణంగా వట్టిపోయిన పశువులను రైతులు, యజమానులు కబేళాకు తరలిస్తుంటారు. ఇలాగే లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థ యాజమాన్యం సైతం వట్టిపోయిన పశువులను మాత్రమే కొనుగోలు చేసి వధించి మాంసం ఎగుమతి చేస్తున్నామని ప్రచారం చేసింది. తాజాగా కార్మాగారానికి తరలిస్తున్న పశువుల్లో ఎక్కువ శాతం పాడి గేదెలు ఉండటం విశేషం అయితే రైతులు, వాటి యజమానులు పాడి గేదెలను వధించడానికి సాహసించరు. ఇటీవల కాలంలో తణుకు పరిసర ప్రాంతాల్లో గేదెలను అపహరిం చుకుపోతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాత్రి సమయాల్లో కొందరు ముఠాలుగా ఏర్పడి గ్రామ శివారుల్లో గేదెల ఫామ్లు, పాకలను లక్ష్యంగా చేసుకుని పశువులను అపహరించి ఇక్కడ విక్రయించి సొమ్ములు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో సైతం రెండు పాడి గేదెలను అపహరించుకుపోయిన ఘటనలో గ్రామానికి చెందిన బండి ఈశ్వరరావు అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో నిందితుణ్ని అరెస్టు చేసినప్పటికీ పశువులను పోలీసులు రికవరీ చేయలేకపోయారు. ఇదే తరహాలో గేదెలను దొంగిలించి ఎక్కువ మొత్తానికి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఠా సభ్యులకు తేతలి గ్రామానికి చెందిన కొందరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
హిందువులు దైవంగా పూజించే గోవులతో పాటు పాడిగేదెలను అక్రమంగా వధిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా తణుకులో జరుగుతున్న ఈ అక్రమ గోవధను అడ్డుకోవాలని గో సంరక్షణ సమితి సభ్యులు బి.శ్రీనివాస్, జల్లూరి జగదీష్‌లు విన్నవించారు.





