
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను కేవలం చర్చలు, సంప్రదింపులతోనే పరిష్కారం కాకపోవచ్చని, మరిన్ని నిర్దిష్టమైన చర్యలు అవసరమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆఖిలభారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి హితవు చెప్పారు.
బాంగ్లాదేశ్ లో మైనారిటీలపై జారుతున్న దాడుల పట్ల నిరసనగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్వహించిన సకల హిందూ సమాజ్ సభలో పాల్గొంటూ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే చర్చలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని తాను ఆశిస్తున్నానని, ఒకవేళ అలా జరగకపోతే మరో పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మహ్మద్ యూనస్ నడుపుతున్న బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం శాంతి లేదని సునీల్ అంబేకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మాట వినకపోతే మరో మార్గాన్ని వెతకాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌కు ఆయన కీలక సూచనలు చేశారు.బంగ్లాదేశ్‌లో ఏమి జరుగుతుందో ప్రతి హిందువు ఆగ్రహంగా ఉన్నారని చెబుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులపై అఘాయిత్యాలు ఆగిపోయి దోషులను శిక్షించేలా చూడాలని అంబేకర్ కోరారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పొరుగు దేశంలో పర్యటించడం వల్ల కొంత పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం “మరిన్ని గట్టి చర్యలు” తీసుకోవాలని, ఇందుకోసం ఇతర దేశాలతో కూడా మాట్లాడాలని ఆయన చెప్పారు.
బంగ్లాదేశ్‌లో ఇబ్బందులను సృష్టించే వారి వెనుక కొన్ని ప్రపంచ శక్తులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. “మనం అలాంటి శక్తులను గుర్తించి వాటిని బహిర్గతం చేయాలి. మన దేశంలో, ఇతర దేశాలలో హిందువులకు సంబంధించి అలాంటి వాటిని ఆపమని వారికి చెప్పాలి” అని అంబేకర్ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టు, ఆయన న్యాయవాదిపై దాడి దారుణాల పరిమితిని దాటిందని అంబేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు పారిపోవడం లేదని, ఐక్యంగా అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.





