News

యుద్ధంలో పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం : ఆస్ట్రియా విశ్లేషకుడు

35views

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేసిన దాడులపై ఆస్ట్రియా వైమానిక యుద్ధ విశ్లేషకుడు, చరిత్రకారుడు టామ్‌ కూపర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌పై భారత్‌ దాడులను స్పష్టమైన సైనిక విజయంగా ఆయన అభివర్ణించారు. భారత్‌ సైనికపరంగా పాక్‌ను మించిపోవడమే కాకుండా తన ప్రణాళికాబద్ధమైన, కచ్చితమైన ప్రతిస్పందన ద్వారా బలమైన వ్యూహాత్మక సందేశాన్ని దాయాది దేశానికి ఇచ్చిందని, పూర్తి ఆధిపత్యం చెలాయించిందని ఓ ఇంటర్వ్యూలో టామ్‌ వ్యాఖ్యానించారు. ‘‘పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ అత్యంత కచ్చితమైన ప్రతీకార దాడులు చేసింది. భారత్‌ చేరుకోలేదని భావించిన అసాధ్యమైన లక్ష్యాలనూ ఛేదించింది. దీంతో తీవ్రంగా నష్టపోయిన పాక్‌ రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లింది. భారత్‌ కార్యాచరణ సామర్థ్యం దాని వ్యూహాత్మక విధానంలో ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. పాకిస్థాన్‌లోని దేనిపైనైనా దాడి చేయగలమని, తమను ఆపలేరని పాక్‌కు భారత్‌ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. దీనికి ప్రతిగా పాక్‌ చేసిన దాడులను భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి’’ అని టామ్‌ పేర్కొన్నారు. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేంత స్థాయి పాక్‌కు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.