News

వీహెచ్‌పీ ఆధ్వర్యంలో జైలు అధికారిణి, ఖైదీ వివాహం

4views

జైలు అధికారిణి,  ఖైదీ మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. ఆ వ్యక్తి జైలు శిక్ష ముగిసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ (వీహచ్‌పీ) ఆధ్వర్యంలో వారిద్దరూ మతాంతర వివాహం చేసుకున్నారు.   మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చాండ్లా ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర సింగ్‌ 2007లో ఒక కౌన్సిలర్‌ను హత్య చేశాడు. ఈ కేసులో కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

కాగా, సత్నాలోని సెంట్రల్‌ జైలులో ధర్మేంద్ర సింగ్‌ జైలు శిక్ష అనుభవించాడు. ఈ సందర్భంగా వారెంట్ సంబంధిత పనుల్లో జైలు అధికారులకు సహాయం చేశాడు. ఈ నేపథ్యంలో వారెంట్ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన జైలు అధికారిణి అయిన అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ ఫిరోజా ఖతూన్, ఖైదీ ధర్మేంద్ర సింగ్‌ మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమ సంబంధంగా మారింది.

మరోవైపు సుమారు 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ధర్మేంద్ర సింగ్, సత్ప్రవర్తన కారణంగా నాలుగేళ్ల కిందట జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో రిలేషన్‌లో ఉన్న జైలు అధికారిణి ఫిరోజా ఖతూన్‌, అతడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే వీరిద్దరి మతాంతర వివాహాన్ని ఫిరోజా ముస్లిం కుటుంబం వ్యక్తిరేకించింది.

కాగా, మే 5న ఛతర్‌పూర్ జిల్లాలో ధర్మేంద్ర సింగ్, ఫిరోజా ఖతూన్ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్‌బహదూర్ మిశ్రా, ఆయన భార్య కలిసి ‘కన్యాదానం’ నిర్వహించారు. బజరంగ్‌ దళ్‌ సభ్యులతోపాటు సత్నా సెంట్రల్‌ జైలు అధికారులు, సిబ్బంది, కొందరు ఖైదీలు ఈ వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.