News

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం

35views

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు విజయవాడలోని ఎస్‌ఎల్‌వీ గ్రీన్ విల్లాస్‌లో ప్రారంభించిన మొబైల్ వెహికల్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శ దర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో  ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనను మంత్రి ప్రస్తావించారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాల ద్వారా రైతులకు భరోసా కలగడమే కాకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించిన మంత్రి.. ప్రతి ఒక్కరూ సహజ సాగు వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఇటువంటి సానుకూల మార్పులు రాష్ట్ర ప్రగతికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.