News

మహా కుంభమేళాకు ఏపీ ప్రజలు తరలిరండి

263views

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళాకు ఆంధ్రా ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య పిలుపునిచ్చారు. 12 ఏళ్ల తర్వాత జరగనున్న మహాకుంభమేళాకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు ఆయన శనివారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘మహా కుంభ్‌-2025కు అన్ని రాష్ట్రాలనూ యూపీ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. వంద పడకలతో ఆసుపత్రి, పది పడకల ఐసీయూ, పెద్దసంఖ్యలో వైద్యారోగ్య కార్యకర్తలను అందుబాటులో ఉంచాం. ఈ మహా కుంభమేళాకు సుమారు 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. సందర్శకులకు రూట్‌మ్యాప్‌ తెలిసేలా ప్రత్యేక వెబ్‌సైట్, యాప్, వాహనాల పార్కింగ్‌కు క్యూఆర్‌ ఆధారిత పాస్‌లు కల్పించాం’ అని కేశవ్‌ప్రసాద్‌ మౌర్య తెలిపారు. ఆయనతో పాటు ప్రయాగ్‌రాజ్‌ ఎమ్మెల్యే సిద్ధార్థనాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు.