బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత సమాజానికి చెందిన పలువురు ముస్లింలు తీవ్రంగా ఖండించారు. సత్వరమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనుస్ కి ఈ మేరకు లేఖ రాశారు. భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఖురేషీ, ఢిల్లీ మాజీ ఎల్జీ నజీబ్ జంగ్, పారిశ్రామికవేత్త సయీద్ శేర్వాణీ సంతకాలు చేసిన వారిలో వున్నారు.
మైనారిటీలపై వేధింపులు ఇస్లాం వ్యతిరేక చర్యగా వారు అభివర్ణించారు. హిందువులను, మైనారిటీలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. హిందువులపై, మైనారిటీలపై జరుగుతున్న దాడులను తాము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. ఇలా దాడులు చేయడం, ఇస్లాంను ఈ కోణంలో చూపడం పిరికిపంద చర్య అని అభివర్ణించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని నిరూపించుకునే విషయంలో ఇదో క్లిష్టమైన పరీక్ష అని భారత ముస్లిం మేధావులు పేర్కొన్నారు.