
పోలీసు ఇన్‌ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు ఓ మహిళను చంపిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నారనే అనుమానంతో బీజాపుర్‌కు చెందిన లాడెడ్ గ్రామస్థురాలు యాలం సుక్రా (40) అనే మహిళను, ఆమె భర్తను శనివారం అర్థరాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం వారిని సమీపంలోని కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి.. మహిళను గొంతు కోసి, హత్య చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మహిళ భర్తపైనా కర్రలతో దాడి చేశారన్నారు.
మృతురాలు 2017 నుంచి తెలంగాణ పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నారని.. అందుకే హత్య చేసినట్లు మావోయిస్టులు ఘటనాస్థలిలో వదిలిన లేఖను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బీజాపుర్‌లోని బస్తర్ డివిజన్‌లో ఈ ఏడాది మావోయిస్టుల దాడిలో 60మందికి పైగా మృతి చెందారు. నాలుగు రోజుల వ్యవధిలో నలుగురిని హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇటీవల బీజాపుర్‌లోని బాసగూడ ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తను, ఇద్దరు మాజీ సర్పంచ్‌లను పోలీసు ఇన్‌ఫార్మర్లుగా ఆరోపిస్తూ మావోయిస్టులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌లోని పోలీసు బేస్ క్యాంప్‌పైనా మావోయిస్టులు రాకెట్ లాంచర్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవానుకు గాయాలయ్యాయి.





